ప్రతి రైతుకూ భూసార పత్రం

Soil tests Report For Every Farmer In Ananthapur - Sakshi

భూసార పరీక్ష కేంద్రం లక్ష్యమిదేరెండో విడత కింద మళ్లీ 52,044  మట్టి పరీక్షలు  

ఏడీఏ జి.విజయశేఖర్‌  

అనంతపురం అగ్రికల్చర్‌:  ప్రతి రైతుకూ భూసార పత్రం అందజేయాలనే ఉద్దేశంతో ఈ ఏడాది 52,044 మట్టి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని భూసార పరీక్షా కేంద్రం (సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ–ఎస్‌టీఎల్‌) సహాయ సంచాలకులు జి.విజయశేఖర్‌ తెలిపారు. పంటల సాగు, దిగుబడులు, ప్రజారోగ్యం, పర్యావరణ కాలుష్య పరంగా మట్టి పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. అందువల్ల రైతులందరూ తమ పొలాల్లో మట్టి నమూనాలు తీయించి వాటి ఫలితాలకు సంబంధించిన సాయిల్‌హెల్త్‌కార్డు తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే 52,044 పరీక్షలు
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద గత నవంబర్‌ నుంచి ఈ ఏప్రిల్‌ వరకు 52,044 మట్టి నమూనాలు తీసి వాటిని పరీక్షించాం. ఇపుడు రెండో విడతగా మే నుంచి వచ్చే మార్చి లోపు జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లోని మట్టిని సేకరించి పరీక్షలు పూర్తిచేసి భూసార పత్రాలు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో మొదటి విడత భూసార పత్రాలు (సాయిల్‌హెల్త్‌కార్డులు) పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటూనే, రెండో విడత కింద మట్టి నమూనాల సేకరణ ప్రారంభించాం. రెండో విడత కింద ఇప్పటికే 2 వేల నమూనాలు ప్రయోగశాలకు చేరాయి. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలతో పాటు సంచార వాహనం ద్వారా పరీక్షలు నిర్వహిస్తాం. 25 ఎకరాలను ఒక గ్రిడ్‌గా విభజించి మొదటి విడత మాదిరిగానే రెండో విడతలో కూడా 3.62 లక్షల మంది రైతులకు భూసార పత్రాలు అందజేయాలని ప్రణాళిక రూపొందించాం.

సిఫారసుల ఆధారంగాపోషక యాజమాన్యం
పరీక్షల తర్వాత భూమిలో పోషకాలు ఏ మేరకు ఉన్నాయి..? ఇంకా ఎలాంటి పోషకాలు పొలంలో వేయాలనే అంశాల నివేదికను భూసార పత్రాల్లో నమోదు చేసి రైతులకు ఇస్తాం. వాటి ఆధారంగా రైతులు ఎరువుల యాజమాన్యం పాటిస్తే పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. మట్టి నమూనాలు ఇక్కడకు రాగానే వాటిని మరోసారి పరిశీలించి కావల్సినంత పరిమాణంలో వేరు చేస్తాం. తర్వాత పీహెచ్‌ (భూమి స్థితి) శాతం ఎలెక్ట్రికల్‌ కండక్టర్‌ (ఈసీ), ఆర్గానిక్‌ కర్బన్‌ (ఓసీ), నైట్రోజన్‌ (ఎన్‌), ఫాస్పరస్‌ (పి), పొటాష్‌ (కె), సల్ఫర్, బోరాన్‌ పోషకాల శాతం పరీక్షలు నిర్వహిస్తాం. వీటితో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్‌ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్‌) శాతం తెలుసుకునే పరీక్షలు చేస్తాం. అన్నింటినీ క్రోడీకరించి ఉన్న పోషకాల శాతం, లేనివి ఏంటి, ఏ పంటలకు ఎలాంటి పోషకాలు ఎంత శాతం వాడాలనే వివరాలతో కూడిన పత్రాలు తయారు చేసి రైతులకు అందజేస్తాం. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో భూసార పత్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది.  

ప్రతి రైతుకూ భూసార పత్రం
ప్రతి రైతుకూ భూసార పత్రం ఇవ్వాలనే లక్ష్యంతో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత మూడేళ్ల కాలంలో 1.63 లక్షల మట్టి పరీక్షలు నిర్వహించి 5.10 లక్షల మంది రైతులకు భూసార పరీక్ష పత్రాలు ఇచ్చాము. ఈసారి రెండు విడతలు పూర్తిచేస్తే మొత్తంగా 2.67 మట్టి పరీక్షల ద్వారా 12.34 లక్షల మంది రైతులకు ఇచ్చినట్లవుతుంది. ఇలా జిల్లాలోని ప్రతి రైతుకూ భూసార పత్రం అందేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడతలో కూడా అనంతపురం కేంద్రం ద్వారా 29,033 పరీక్షలు, ధర్మవరంలో 9,775 పరీక్షలు, పెనుకొండలో 8,750 పరీక్షలతో పాటు సంచార భూసార వాహనం ద్వారా 5,216 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం గ్రామ గ్రామానా జీపీఎస్‌ సాయంతో ఇప్పటికే మట్టి నమూనాలు సేకరిస్తున్నాం. ఇందుకు వ్యవసాయాధికారులు, రైతులు సహకరిస్తే సకాలంలో లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top