అట్టహాసంగా సోషల్‌ మీడియా అవార్డ్స్‌

Social Media Awards In Amaravati - Sakshi

సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డ్స్‌–2018 ఆరంభం

ప్రత్యేక ఆకర్షణగా ‘మిత్ర’ రోబో, వీవీఎస్‌ లక్ష్మణ్‌

నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

హాజరుకానున్న సినీ ప్రముఖులు కరీనా కపూర్, సమంత, దేవీశ్రీప్రసాద్‌

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డ్స్‌–2018 కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలు శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మెన్‌ గద్దె అనూరాధ, పర్యాటక శాఖ సీఈఓ హిమాన్షు శుక్లాలు పాల్గొన్నారు.

మంత్రముగ్ధులను చేసిన ‘మిత్ర’
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ‘మిత్ర’ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను 2017 హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు తొలిసారిగా ఆవిష్కరించారు. ఐదడుగులున్న ఈ రోబో తన మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటక శాక సీఈఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్‌ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఇస్తోందన్నారు. సోషల్‌ మీడియా ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఎగబడ్డారు.తరలిరానున్న సినీ తారలు..

శనివారం సోషల్‌ మీడియా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియాలో చురుకుగా పాల్గొంటున్న సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ నటీ కరీనా కపూర్, టాలీవుడ్‌ నటీ సమంతా అక్కినేని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లకు అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో రాణిస్తున్న మరో 40 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top