దర్జాగా కబ్జా | Smugly capture | Sakshi
Sakshi News home page

దర్జాగా కబ్జా

Jan 25 2015 2:19 AM | Updated on Sep 2 2017 8:12 PM

దర్జాగా కబ్జా

దర్జాగా కబ్జా

అనంతపురం నగర పరిధిలో సెంటు స్థలం విలువ రూ.10 లక్షలకు పైగా ఉంది. అదే అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది.

అనంతపురం టౌన్: అనంతపురం నగర పరిధిలో సెంటు స్థలం విలువ రూ.10 లక్షలకు పైగా ఉంది. అదే అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. నగర పాలక సంస్థకు చెందిన అత్యంత విలువైన ఇలాంటి స్థలాలపై అధికార పార్టీకి చెందిన నేతలు కన్నేస్తున్నారు. ఇలాంటి సంఘటన నీరుగంటి వీధిలో చోటు చేసుకుంది. ఏకంగా రూ.60 లక్షలు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారు. ఈ ప్రాంతంలో సంస్థకు సంబంధించి 2081 సర్వే నెంబరులో ఎనిమిది సెంట్ల స్థలం ఉంది.

ఇక్కడ సెంటు విలువ రూ.15 లక్షల వరకు ఉంది. దీంతో ఈ స్థలంపై అధికార పార్టీకి చెందిన ఒక చోటా ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఆ స్థలంలో 4.50 సెంట్లకు సంబంధించి 2008లో పట్టా పొందినట్లుగా నకిలీ పట్టా సృష్టించి గదులు నిర్మించారు. అది కార్పొరేషన్ స్థలమని తెలుసుకున్న స్థానికులు వాయిల శ్రీనివాసులు అలియాస్ బండలశీనా, కె.సురేష్‌రెడ్డి అనే వ్యక్తులు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఆ స్థలానికి పట్టా ఉందంటూ ఇక్కడి అధికారులు తిప్పిపంపారు.

దీంతో వారు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి సదరు స్థలానికి పట్టా ఇచ్చారా లేదా తెలపాలని సమాచార హక్కు చట్టం కింద కోరారు. దీనిపై విచారణ చేసిన తహసిల్దార్ అక్కడి స్థలానికి పట్టా ఇవ్వలేదంటూ ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. తహసిల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌ని కార్పొరేషన్ అధికారులకు అందజేశారు. దీంతో సర్వే చేసిన అధికారులు అది సంస్థ స్థలంగా నిర్ధారించారు. దీన్ని బట్టి చూస్తే రూ.60 లక్షలకు పైగా విలువ చేసే స్థలాన్ని కైవసం చేసుకున్నారనేది స్పష్టమవుతోంది. ఈ కథంతా అధికార పార్టీకి చెందిన ఒక చోటా ప్రజాప్రతినిధి నడిపినట్లు తెలుస్తోంది.
 
అది సంస్థ స్థలమే : రమణ, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్
నీరుగంటి వీధిలో గదులు నిర్మించిన స్థలం సర్వే చేశాము. అది సంస్థ స్థలంగానే గుర్తించాము. ఒక లే అవుట్‌కి సంబంధించి ఓపెన్ స్థలం అది. అక్కడ ఎంత స్థలం ఉందనేది సర్వేయర్ ద్వారా సర్వే చేయించి హద్దులు వేయించాలని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించాము. విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో నోటీసులు జారీ చేసి కూల్చివేస్తాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement