అబ్బాయిలూ జాగ్రత్త!

The Silent Suffering Of Men Facing Sexual Harassment - Sakshi

బాలురపైనా పెరుగుతున్న లైంగిక దాడులు

ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని తల్లిదండ్రులు

పరువు పోతుందనే భయంతో వెనకడుగు 

నేరం రుజువైతే నేరస్తులకు ఏడేళ్ల వరకు శిక్ష

తమతో హోమో సెక్స్‌లో పాల్గొనలేదని ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని తోటి యువకులు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. కర్నూలు నగరంలోని కొత్తపేటకు చెందిన 8 ఏళ్ల బాలుడిపై స్థానికంగా ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలపై పోలీస్‌ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఇలాంటి సంఘటనలు సమాజంలో ప్రతి చోటా రోజూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫిర్యాదు చేయడానికి 99 శాతం ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ కారణంగా దాడికి పాల్పడిన వారు యథేచ్ఛగా ఈ సమాజంలో తిరుగుతూ మరికొన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. సమాజంలో అమ్మాయిలపైనే కాదు అబ్బాయిలపైనా లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. 

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌):  సమాజంలో అమ్మాయిలపై దాడులు జరిగితే గతంలో ఫిర్యాదులు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కాదు. ఈ విషయం పది మందికి తెలిస్తే ఆడపిల్లకు పెళ్లి కాదని, సమాజం చీత్కరించుకుంటుందని భయపడేవారు. దాడి కంటే సమాజంలో ప్రతి ఒక్కరూ చూసే చూపులు, అడిగే ప్రశ్నలు వారిని మరింత కుంగుబాటుకు గురిచేసేవి. అయితే ఇటీవల కాలంలో చట్టాలపై అవగాహన పెరగడంతో కొంత మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో అమ్మాయి పేరు, ఆమె తల్లిదండ్రుల పేర్లను బహిర్గతం చేయకపోవడంతో ఫిర్యాదులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు పెరిగాయి. ఇందుకు తగ్గట్లు నేరం రుజువైతే నిందితులకు శిక్షలూ పడుతున్నాయి. 

అయితే నేరం చేసిన వారు పలుకుబడి గల వారైతే మాత్రం చేసిన తప్పు నుంచి యథేచ్ఛగా తప్పించుకుంటున్నారన్న భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇప్పుడు అబ్బాయిలపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి యువకుల వరకు ఈ దాడులు కొనసాగుతున్నాయి. అది కూడా మెతకవైఖరి ఉన్న వారిపైనే అధికంగా దాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడి జరిగిన విషయాన్ని చాలా మంది పిల్లలు భయంతో ఇంట్లో చెప్పడం లేదు. వారి ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు కనుక్కొని సదరు వ్యక్తిని కొట్టడమో, తిట్టడమో చేసి వస్తున్నారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. దీనికి కారణం పరువు పోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. 

ఫిర్యాదు చేసిన తర్వాత సమాజంలో తిరిగే టప్పుడు ‘మీ అబ్బాయికి ఇలా జరిగిందట కదా’ అని ఇరుగుపొరుగు వారు, బంధువులు అనే మాటలకు తట్టుకోలేమని వారు వెనక్కి తగ్గుతున్నారు.  కర్నూలుకు చెందిన విష్ణుతేజ అనే యువకుడు మగ పిల్లలపై జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేక, ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించక పోవడంతో ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ‘దాడులు చూసే ఓపిక నాకు లేదు.. నన్ను నొప్పి లేకుండా చంపేయండి’ అంటూ వేడుకున్నాడు. దీంతో జిల్లా అధికారులు కదిలారు. అతనితో మాట్లాడి ఫిర్యాదులకు స్పందిస్తామని హామీ ఇస్తున్నారు.   

అరచేతిలో అశ్లీలత.. 
స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్దలు, పిల్లలు అతిగా వినియోగిస్తున్నారనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియా, ఇంటర్‌నెట్‌ వాడకం పెరిగిపోయింది. కొందరు యువకులు విచ్చలవిడిగా సెల్‌ఫోన్‌లో అశ్లీలత వీడియోల వీక్షిస్తున్నారు. ఈ కారణలతో లైంగిక దాడుల ఆలోచనలు వస్తుంటంతో ప్రతిఘటించలేని వారిపైనే దాడులు జరుగుతున్నాయి.  అమ్మాయిలపైనే గాక అబ్బాయిలపైనా విశృలంఖ దాడులు చేస్తున్నారు. అమ్మాయిల విషయాలు ఎలా గోలా బయటకు వస్తాయి, కానీ అబ్బాయిల విషయంలో బయటకు రావడం లేదు.  పిల్లలు సెల్‌ ఫోన్‌ వినియోగించే సమయంలో ఎటువంటి సైట్లు చూస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు దృష్టి సారించకపోతే పిల్లల భవిష్యత్‌లో అంధకారం అలుముకునే అవకాశం ఉంది. అలాగే చుట్టు పక్కల ఉండే యువకుల ప్రవర్తనపై చిన్నారుల తల్లిదండ్రు లు ఓ కన్నేసి ఉండాల్సిన అవసరం ఉంది.

మంచి స్పర్శ.. చెడు స్పర్శ 
మంచి స్పర్శ...చెడు స్పర్శ (గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌)కు సంబంధించి పిల్లలకు తేడా తెలిసి ఉండాలి. ఈ మేరకు వారికి తల్లిదండ్రులతో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. దుస్తులతో దాచిన శరీర భాగాలను వేటిని స్పర్శించినా అది లైంగిక దాడి కిందకే వస్తుంది. పిల్లల విషయంలో అది ఆడైనా, మగైనా నేరమే. పిల్లలను చెడు ఉద్దేశంతో స్పర్శించినా, పిల్లలకు అంగాలను చూపించినా, ప్రదర్శించినా నేరమే. దీనికి మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్షలు ఉంటాయి.

గతంలో దాడికి గురైన వారే ఇలా చేస్తున్నారు 
గతంలో లైంగిక దాడికి గురైన వారే పెద్దయ్యాక ఇతరులపై అలాంటి దాడులకు దిగుతున్నారు. నేను 6వ ఏట, ఆ తర్వాత 8, 9, 10 తరగతుల్లో వేధింపులకు గురయ్యాను. నాతో పాటు సమాజంలో చాలా మంది పిల్లలు లైంగిక దాడులకు, వేధింపులకు గురవుతున్నారు. ఈ విషయమై నేను పలు మార్లు పోలీసులకు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారు స్పందించకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారులకు, మహిళా కమిషన్‌ చైర్మన్‌కు, తాజాగా రాష్ట్రపతికి సైతం లేఖ రాశాను. నా లేఖకు స్పందించి జిల్లా కలెక్టర్‌ నన్ను పిలిపించారు. నా పోరాటానికి సపోర్ట్‌గా ఉంటారనని చెప్పారు. ఆయనే కాదు డీఎస్పీ, ఎస్‌ఐ, జువైనల్‌ హోమ్‌ సూపరింటెండెంట్‌ కూడా నాకు ఫోన్‌ చేసి ధైర్యాన్నిచ్చారు. – విష్ణుతేజ, బాధితుడు, కర్నూలు      

పిల్లలపై లైంగిక దాడి చేస్తే కఠిన శిక్ష 
ప్రొటెక్షన్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌ 2012 ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగిక అత్యాచారానికి పాల్పడితే శిక్షార్హులు. దాడి తీవ్రతను బట్టి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు, కొన్నిసార్లు జీవితఖైదు కూడా పడే అవకాశం. అయితే లైంగిక దాడికి గురైన వారిని 24 గంటల్లో వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. సరైన ఆధారాలు చూపించగలిగితే నేరస్తులు తప్పించుకోలేరు.  – రామ్మోహన్‌రెడ్డి, జువైనల్‌ హోమ్‌ సూపరింటెండెంట్‌ 

బాధితులకు కౌన్సిలింగ్‌ 
తల్లిదండ్రులు వలస వెళ్లిన సమయంలో, పిల్లలు వసతి గృహాల్లో ఉండే సమయాల్లో, పేరెంట్‌ నిఘా లేనప్పుడు మగ పిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతుంటాయి. దాడికి గురైన పిల్లలను కౌన్సిలింగ్‌ ద్వారా ఆ సంఘటన తాలూకు బాధ నుంచి బయటకు తీసుకురావచ్చు. దాడి వల్ల మరింత భయాందోళనకు గురై డిప్రెషన్‌లో ఉన్న వారికి కౌన్సిలింగ్‌తో పాటు మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాడికి గురైన పిల్లల్లో అపరాద భావం పోగొట్టే బాధ్యతను ఇటు వైద్యులతో పాటు అటు తల్లిదండ్రులు, పెద్దలు తీసుకోవాల్సి ఉంటుంది.    – డాక్టర్‌ కాటం రాజశేఖర్‌రెడ్డి, మానసిక వ్యాధుల నిపుణులు, కర్నూలు 

పాఠశాల నుంచే పిల్లలకు అవగాహన పెంచాలి 
గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ల గురించి పిల్లలకు పాఠ శాల దశ నుంచే అవగాహన పెంచాలి. సూర్యరశ్మి తగలని భాగాలను ఎవరైనా తాకినట్లు తెలి స్తే వెంటనే పెద్దలకు చెప్పే విధంగా ఉండాలి. అమ్మాయిలు, అబ్బాయిల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. లైంగిక దాడులు అబ్బాయిలపై వసతి గృహాలు, జువైనల్‌ హోమ్స్, కారాగారాల్లో అబ్బాయిలు, మగవారిపై ఎక్కువగా జరుగుతుంటాయి. విష్ణుతేజ ఒక్కరే కాదు ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ వెలుగులోకి తీసుకురావాలి.    – డాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top