వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

Showrooms Can't Deliver Vehicles Without Temporary Registration - Sakshi

టీఆర్‌ లేకుండా వాహనాలు అమ్మితే లైసెన్స్‌ రద్దు

గత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లలో భారీగా అక్రమాలు

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు

సాక్షి, గుంటూరు: నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో గత మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై గుంటూరు నుంచి వస్తుండగా రవాణా శాఖ అధికారి ఆపారు. ఆ వ్యక్తి బైక్‌ను మూడు రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అయితే ఆ బైక్‌కు టీఆర్‌ లేదు. టీఆర్‌ లేకపోవడంపై బైక్‌ యజమానిని ప్రశ్నించగా షోరూమ్‌ డీలర్‌ వారం రోజుల తర్వాత టీఆర్‌ చేస్తానని చెప్పాడని బైక్‌ యజమాని సమాధానం ఇచ్చాడు. ఆ బైక్‌ను ఏ షోరూమ్‌లో కొనుగోలు చేశాడో ఆరా తీసిన రవాణా శాఖ అధికారులు ఆ షోరూమ్‌ లైసెన్స్‌ను బ్లాక్‌ చేశారు. లైసెన్స్‌ రద్దుకు సిఫార్సు చేశారు. జిల్లాలో చాలా వరకూ షోరూమ్‌లు ఇదే రీతిలో టీఆర్‌ లేకుండా వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి విడుదల చేస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.                                          

పారదర్శకంగా ప్రజలకు రవాణా శాఖ సేవలు అందించేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ సేవల పేరుతో గత ప్రభుత్వ హయాంలో క్షేత్ర స్థాయిలో వినియోగదారులను అడ్డంగా దోచుకున్నారు. జిల్లాలోని వాహనాల షోరూమ్‌లపై రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహన షోరూమ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వాహనాల విక్రయాలు జరపడమే కాకుండా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు.

టీఆర్‌ లేకుండానే అమ్మకాలు
జిల్లాలో 35 టూవీలర్, 7 ఫోర్‌ వీలర్‌ వాహన షోరూమ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా 100కు పైగా సబ్‌ డీలర్‌ షోరూమ్‌లు నడుస్తున్నాయి. ఆయా డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) లేకుండానే వాహనాలను డెలివరీ చేసేస్తున్నారు. ఇలా వాహనాలు విక్రయించడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక వాహనం బయట తిరగాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి. కొత్తగా కొనుగోలు చేసిన వాహనమైతే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాతే వాహనాన్ని రోడ్డు మీదకు వదలాలి. అయితే జిల్లాలోని పలు షోరూమ్‌ల నిర్వాహకులు టెంపరరీ రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) లేకుండానే వాహనాలను రోడ్లపైకి విడుదల చేస్తున్నారు.

ఇటీవల టీఆర్‌ లేకుండా టూవీలర్‌ను విక్రయించిన నరసరావుపేట పట్టణంలోని యర్రంశెట్టి మోటర్స్‌ షోరూమ్‌ లైసెన్స్‌ను రవాణా శాఖ అధికారులు బ్లాక్‌ చేశారు. కొందరు డీలర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వాహన కొనుగోలు సమయంలో ఇన్వాయిస్‌ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిఫ్టింగ్‌ చార్జీలు, అదనపు చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు షోరూమ్‌ నిర్వాహకులు చిల్లు పెడుతున్నారు. టూ వీలర్‌కు రూ.2 నుంచి 5 వేలు, ఫోర్‌ వీలర్‌కు రూ. 5 నుంచి 50వేల వరకూ అదనంగా వసూళ్లు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక దినాల్లో షోరూమ్‌ నిర్వాహకులు వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇకపై ఇలాంటి వసూళ్లకు పాల్పడే డీలర్లపై కొరడా ఝుళిపించనుంది. 

ప్రత్యేక నిఘా
గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలోని ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇటీవల విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం జిల్లాల్లో భారీ కుంభకోణాన్ని ఆ శాఖ అధికారులు వెలికి తీసిన విషయం తెలిసిందే. వాహనాల విక్రయ ధరలను అమాంతం తగ్గించి లైఫ్‌ ట్యాక్స్‌ ఎగవేసినట్లు రవాణా శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో జరిపిన సోదాల్లో వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.250–300కోట్ల వరకూ లైఫ్‌ ట్యాక్స్‌ ఎగవేతకు గురైనట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో జిల్లాలో జరిగిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు, షోరూమ్‌లలో రికార్డులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.  

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
షోరూమ్‌ నిర్వాహకులు టీఆర్‌ లేకుండా వాహనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇన్వాయిస్‌ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తాం. వాహన షోరూమ్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపడతాం. షోరూమ్‌ నిర్వాహకులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, లిఫ్టింగ్‌ చార్జీల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడితే వినియోగదారులు మాకు ఫిర్యాదు చేయండి.
– ఈ.మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top