
సాక్షి, గజపతినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్న నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత పెంటయ్యతో పాటు వందలాది మంది అనుచరులతో కలిసి మంగళవారం గజపతినగరం మండలం ముచ్చర్లలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పెంటయ్య మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్నానని, అయినా పార్టీలో ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నమ్మకంతోనే తామంతా పార్టీలో చేరినట్లు తెలిపారు.
వైఎస్సార్ విగ్రహావిష్కరణ
అంతకముందు ముచ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్యతో కలిసి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాపు, బలిజ, ముస్లిం మైనార్టీలు జననేతను హృదయపూర్వకంగా కలిశారు. తమ సంక్షేమం కోసం ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. జననేత పాదయాత్రకు కాపు, మైనార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు.
చిత్రీ పట్టిన జననేత
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం మండలంలోని ముచ్చర్లలోని వడ్రంగి కులస్థులను జననేత కలిశారు. వడ్రండి చిత్రీ పట్టిన రాజన్న తనయుడు వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కలప లభ్యత ఎక్కువగా ఉందని, ఆధునిక పనిముట్లు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక జీవనోపాధి కోల్పోతున్నామని జననేత ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు తెలుసుకున్న జననేత వరాకి కొండంత భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.