రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటన చేసిన సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను కలిశారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటన చేసిన సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను వారు ఈ సందర్భంగా ఆజాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తాము లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆజాద్ ఎంపీలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా డైలమాలో పడ్డారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయని, కాంగ్రెస్ కూడా ఆలోచించాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈమేరకు వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.