నాన్న ప్రాణం నిలబెట్టండి | Sakshi
Sakshi News home page

నాన్న ప్రాణం నిలబెట్టండి

Published Sun, Mar 29 2015 1:30 AM

నాన్న ప్రాణం నిలబెట్టండి

అధిక బరువు, వ్యాధులతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగి లింగమయ్య పిల్లల విజ్ఞప్తి
కనీసం లేచి నడవలేని దుస్థితి.. ఆదుకోవాలంటూ వేడుకోలు

 
విజయవాడ: రోజు రోజుకూ మరింతగా బరువు పెరిగిపోయే వ్యాధి ఒకవైపు, శరీరం నిండా మానని గాయాలు మరోవైపు.. నడవలేడు, నిలబడలేడు, సరిగా పడుకోలేడు కూడా. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల లింగమయ్య అవస్థ ఇది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కొన్నేళ్లుగా బరువు పెరుగుతూ.. ఇప్పుడు ఏకంగా 202 కేజీలకు పెరిగిపోయారు. 2009లో ఆయనకు గుండెపోటు రాగా స్టెంట్ అమర్చారు. దానికితోడు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి నిమ్స్‌కు వెళ్లినా, పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు.
 
 ఇలాగే అధిక బరువుతో బాధపడి బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం పొందిన ఒక స్నేహితుడి సహాయంతో లింగమయ్య విజయవాడలోని ఎండోకేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ లింగమయ్యను పరీక్షించిన వైద్యులు.. శరీరంలో గాయాలు తగ్గిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయాలు మానడానికి కొద్దిరోజుల పాటు రోజుకు రూ. 10 వేల విలువైన యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుందని.. తర్వాత సర్జరీకి దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని లింగమయ్య కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, తమ తండ్రి ప్రాణాలను కాపాడాలని లింగమయ్య కుమారుడు విక్రమ్, కుమార్తె పరిమళ వేడుకుంటున్నారు. దాతలు నేరుగా లింగమయ్య కుమారుడు విక్రమ్ నంబర్ 9963324224కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, సహాయం అందించవచ్చు.
 

Advertisement
Advertisement