సంక్రాంతి పండగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. మామూలు రోజులకన్నా రెండు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది.
సాక్షి, విజయవాడ :
సంక్రాంతి పండగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. మామూలు రోజులకన్నా రెండు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. ఈ నెల 19వ తేదీ ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కోటి రూపాయల అదనపు ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్‌టీఏ దాడుల నేపథ్యంలో ప్రైవేటు బస్సులు పెద్దగా తిరగకపోవడం ఆర్టీసీ ఆదాయం పెరగడానికి దోహదం చేసినట్లు చెబుతున్నారు. సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పట్టణాల నుంచి పెద్ద ఎత్తున జిల్లా వాసులు తరలివచ్చారు. వీరందరికీ తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. విజయవాడతో పాటు జిల్లాలోని అన్ని డిపోల నుంచి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటుచేసింది. గతంలో ప్రత్యేక బస్సులకు వెళ్లేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నా, తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా ఉండేవి. ప్రస్తుతం ప్రైవేటు బస్సులు తక్కువగా ఉండటంతో వచ్చేటప్పుడు కూడా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల తాకిడి కనిపించింది. దీంతో ఆదాయం గణనీయంగా పెరిగింది.
పండగ ముందు ఇలా...
సంక్రాంతి పండగకు రాజధాని నుంచి వచ్చే ప్రయాణికుల కోసం విజయవాడ డివిజన్ నుంచి హైదరాబాద్ బస్ డిపోకు ప్రత్యేక బస్సులను పంపించారు. అక్కడి నుంచి తొమ్మిదో తేదీన 60 బస్సులు రాగా, పది నుంచి 13 వరకు ప్రతిరోజూ వందకు తగ్గకుండా ప్రత్యేక బస్సులు నడిచాయి. వచ్చిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
640 ప్రత్యేక బస్సులు...
సంక్రాంతి పండగ తర్వాత విజయవాడ నుంచి 480 బస్సులు నడపగా, వివిధ డిపోల నుంచి మరో 160 నడిపారు. వీటిలో 90 శాతం రాజధానికి, మిగిలినవి బెంగళూరు, చెన్నైలకు నడిచాయి. 14న 25 బస్సులు నడపగా, 15 నుంచి వాటి సంఖ్య పెంచారు. 19న అత్యధికంగా 150 బస్సులు నడపగా, 20న 70 బస్సులు నడిపారు.
రికార్డు ఆదాయం...
సంక్రాంతి తర్వాత అదనపు బస్సులు నడపడం ద్వారా రెండు కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం ఆర్టీసీకి దక్కింది. ఆదివారం ఒక్కరోజే కోటీ 20 లక్షలు రావాల్సిన ఆదాయం రెండు కోట్ల 20 లక్షలకు చేరింది. ఇది విజయవాడ డిపో చరిత్రలో రికార్డు. ప్రైవేటు బస్సులు లేకపోవడం, ప్రత్యేక రైళ్లు కూడా రద్దీగా నడవడంతో ప్రయాణికులు ఆర్టీసీనే ఆశ్రయించారు. ఎటువంటి వివాదాలు, అసౌకర్యాలు లేకుండా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చగలిగామని ఆర్టీసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.