సమాధులు మాయం

Sand mafia Collapsed Tombs In Chittoor - Sakshi

ఇసుక కోసం శ్మశానాలను తవ్వేస్తున్న వైనం

బరితెగిస్తున్న ఇసుకాసురులు

కూలీల ప్రాణాలు పోతున్నా ఆగని ఇసుక దందా

నోరుమెదపని అధికారులు

పూర్వీకుల సమాధులు పోయాయని బాధితుల ఆవేదన

మంత్రి సొంత పంచాయతీలో సాగుతున్న అక్రమాలివి

జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబీ కులు మరణిస్తే వారికి గుర్తుగా సమాధులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఏడాదికోసారి సమాధులకు పూజలు చేసి,  గతించిపోయిన వారికి నివాళులర్పిస్తారు. అయితేఇసుకాసురులు ఆ సమాధులను ధ్వంసం చేసేస్తూ పూర్వీకులగురుతులను చెరిపేస్తున్నారు.  ఇదంతా ఎక్కడో కాదు..రాష్ట్రపరిశ్రమల శాఖా మంత్రిఅమరనాథరెడ్డి సొంత పంచాయతీ వీరప్పల్లిలో. ఇక్కడ కొన్నాళ్లుగా అధికారుల సాక్షిగా ఇసుక దందా సాగుతోంది.

చిత్తూరు, పలమనేరు: పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి మంత్రి అమరనాథరెడ్డి సొంత పంచాయతీ. ఈ పంచాయతీలోని గ్రామమే కూరగాయల కొత్తపల్లి. ఇక్కడ 50 కుటుంబాలు కాపురముండగా 46 ఎస్సీలవే. గ్రామానికి ఆనుకుని కొత్తపల్లి చెరువు పక్కన ఎస్సీల శ్మశానం ఉంది. కొన్నాళ్లుగా కొందరు ఆ చెరువులో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో గ్రామస్తులు నోరుమెదపలేదు. చెరువులో ఉన్న ఇసుక ఖాళీ కావడంతో ఇసుకాసురుల కన్ను పక్కనే ఉన్న శ్మశానంపై పడింది. నాలుగు రోజులుగా జేసీబీ వాహనంతో శ్మశానంలోని సమాధులను పెకిలించి కిందనున్న ఇసుకను తోడేస్తున్నారు. దీన్ని గమనించిన గ్రామస్తులు సమాధులను తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ సురేంద్రకు విన్నవించారు. అయితే మంత్రి సొంత పంచాయతీ కావడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. దీంతో గ్రామస్తులు ఆదివారం రాత్రి గ్రామంలో సమావేశమయ్యారు. తమ పూర్వీకుల సమాధులను కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయిం చుకున్నారు. కాస్త ధైర్యం చేసి మళ్లీ అధికారులకు విన్నవించుకున్నా లాభం లేకపోయింది.

ఇక్కడ ఇసుక లాభసాటి వ్యాపారం..
పోలీసులు ట్రాక్టర్లకు జీపీఆర్‌ఎస్‌లను అమర్చి ఇసుక ట్రాక్టర్లు కర్ణాటకలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల అక్రమంగా తరలుతున్న ఇసుక వాహనాలను పట్టుకుని మైనింగ్‌ వారికి జరిమానాల నిమిత్తం పంపుతున్నారు. ఇసుక తవ్వకాలో ఇసుకదిన్నెలు కూలి ఈ ప్రాం తంలో 12మంది దాకా కూలీలు మృతిచెందారు. ఎన్ని జరిగినా ఇసుకాసురులు ఏమాత్రమూ తగ్గలేదు. కర్ణాటకకు ఇసుకు అక్రమ రవాణా ఆగలేదు. ఎందుకంటే నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం మండలాలు కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉండడమే కారణం. స్థానికంగా ట్రాక్టరు ఇసుక రూ.1,600 పలుకుతుండగా అదే ట్రాక్టరు పర్లాంగు దూరంలోకి కర్ణాటకలోకి వెళితే రూ.3,500 పలుకుతోంది. దీంతో ఇసుకాసురులు ఎంతటి రిస్క్‌నైనా భరిస్తూ ఇసుక వ్యాపారాన్ని మాత్రం వదులుకోవడం లేదు.

కండువ కప్పుకో ఇసుక తోలుకో..
ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలామంది అధికార పార్టీలో చేరి ఇసుక వ్యాపారంలో లక్షలు గడిస్తున్నారు. దర్జాగా ఇసుక అక్రమ రవాణా చేయాలంటే ఒక్కటే మార్గం. అధికార పార్టీ కండువా కప్పుకుంటే చాలు ఇక అడిగేవారే లేరు. మూడేళ్లలో అధికార పార్టీలో చేరిన ఇసుకాసురులు 20మంది దాకా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో కూలీలుగా ఉన్నవారు ఇప్పుడు ట్రాక్టర్లకు యజమానులయ్యారు. ట్రాక్టర్లున్న వారు లారీలు కొనేశారంటే ఈ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అధికారులకు ఏమీ కనిపించవు..
కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు కనిపించడం లేదు. వారి కళ్లముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పోలీసులైతే మనకెందుకొచ్చిన తంటా అని వదిలేశారు. కొందరు ఎస్‌ఐలు మామూళ్లు తీసుకుంటూ ఇసుక అక్రమ రవాణాను పెంచి పోషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి ఇలాఖా కావడంతో జిల్లా అధికారలది మౌనముద్రే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top