రాష్ట్ర పున:నిర్మాణంలో భాగంగా సీమాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ సమాఖ్య అధ్యక్షుడు బి.వి.రామారావు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర పున:నిర్మాణంలో భాగంగా సీమాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ సమాఖ్య అధ్యక్షుడు బి.వి.రామారావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు పదేళ్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మౌళిక వసతులు కల్పించేందుకు నాలుగు లక్షల కోట్లు విడుదల చేయాలన్నారు.
రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు అభివృద్ది కాకపోవడానికి కారణం జాతీయ బ్యాంకులేనని, డబ్బు ఉన్నవారికే బ్యాంకు రుణాలు ఇస్తున్నాయన్నారు. గత యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన సీజీటీఎంఎస్‌ఇ (క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజస్ స్కీం) పథకం మన రాష్ట్రంలో సరిగా అమలు కాకపోవడంలేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది కోసం సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ పారిశ్రామికవేత్తలతో ఈనెల 28న విశాఖపట్టణంలో సదస్సు నిర్వహించి వారి సూచనలు, సలహాలను తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తామన్నారు.