సీమాంధ్ర బంద్ ప్రభావం సత్యదేవుని ఆలయంపై కూడా పడింది. భక్తుల్లేక ఆలయం మంగళవారం వెలవెలబోయింది.
సత్యదేవుడికీ బంద్ ఎఫెక్ట్
Aug 14 2013 4:33 AM | Updated on Sep 27 2018 5:56 PM
అన్నవరం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర బంద్ ప్రభావం సత్యదేవుని ఆలయంపై కూడా పడింది. భక్తుల్లేక ఆలయం మంగళవారం వెలవెలబోయింది. సాధారణంగా శ్రావణమాసంలో స్వామివారి ఆలయానికి ప్రతీరోజూ కనీసం ఐదారు వేల మంది భక్తులు వస్తారు. అయితే మంగళవారం కేవలం 2,500 మంది భక్తులు మాత్రమే సత్యదేవుని దర్శించుకున్నారు.ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో సొంతవాహనాలు లేదా అద్దె వాహనాల్లోనే వీరు ఆలయానికి విచ్చేశారు. సత్యదేవుని వ్రతాలు 303, కల్యాణాలు ఎనిమిది జరిగాయి. దేవస్థానానికి రూ. రెండు లక్షల ఆదాయం వచ్చింది.
బోసిపోయిన సత్యదేవుని తొలిపాంచా
కొండదిగువన సత్యదేవుని తొలిపాంచా( తొలి మెట్టు) కూడా మంగళవారం నాడు వాహనాలు లేక బోసిపోయింది. అన్నవరం రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనాల యజమానులు, డ్రైవర్లు ఇక్కడ ఆగి స్వామివారి తొలిమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి వెళుతుంటారు. సీమాంధ్ర బంద్ కారణంగా మంగళవారం నాడు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇక్కడ ఆగేవారే లేరు. ఇక్కడ ఉన్న సత్యదేవుని ప్రసాదాల విక్రయశాలలో కూడా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ప్రతీరోజూ సుమారు పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయిస్తారు. అటువంటిది మంగళవారం నాడు కేవలం రెండు వేల ప్యాకెట్లు మాత్రం విక్రయించారు. కాగా, అన్నవరంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు, బ్యాంకులు, షాపులు మూసివేశారు.
Advertisement
Advertisement