రైట్.. రైట్.. | Sakshi
Sakshi News home page

రైట్.. రైట్..

Published Thu, May 14 2015 1:28 AM

రైట్.. రైట్..

43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు బుధవారం విజయోత్సవం జరుపుకొన్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.బస్సుల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలవడంతో బస్‌స్టేషన్ మళ్లీ కళకళలాడింది.
 
 విజయవాడ :  ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోర్కెలను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆర్టీసీ యూనియన్లు తన ముందు ఉంచిన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించడంతో బుధవారం మధ్యాహ్నం సమ్మె ముగిసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు బస్‌స్టాండ్‌లో విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఎనిమిది రోజు కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో అన్ని సర్వీసులు నడిచాయి.ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె ముగి సింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలి పింది. 2013 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు తక్షణం, సర్వీసుల్లో ఉన్న కార్మికులకు బాండ్ల రూపంలో ఏరియర్స్ ఇస్తామని ప్రకటించింది. జూలై పేస్కేల్ నుంచి ఫిట్‌మెంట్‌తో కలిసిన జీతం అమలులోకి రానుంది.
 
ఉదయం నుంచి కొనసాగిన సమ్మె


సమ్మెలో భాగంగా ఉదయం నుంచి జిల్లాలో పటుచోట్ల కార్మికుల నిరసన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాయి. విజయవాడ పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు సిబ్బంది నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట డిపోలో జరిగిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మద్దతు పలికారు. గుడివాడ, ఇబ్రహీంపట్నం, నూజివీడు, తిరువూరు తదితర డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
 
విజయోత్సవాలు

కార్మికులు సమ్మె విరమణ అనంతరం విజయోత్సవాలు జరుపుకొన్నారు. పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్‌స్టాండ్‌లో రంగులు చల్లుకొని, స్వీట్లు పంచుకున్నారు. జిల్లాలోని ఇతర డిపోల్లోనూ కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు.

 రూ.12 కోట్ల నష్టం

ఆర్టీసీకి జిల్లాలో 8 రోజుల సమ్మెతో రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. మొదటి మూడు రోజు సమ్మె ప్రభావంతో ఎక్కువ సర్వీసులు నడవలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 950 బస్సు సర్వీసులు నడిచాయి. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర దూరప్రాంతాలకు కూడా సర్వీసులు మొదలయ్యాయి.

నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆర్టిసీ సర్వీసులు

 బస్‌స్టేషన్ : ఆర్టీసీ సర్వీసులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని రీజనల్ మేనేజర్ సుదేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె నిర్వహించడంతో ప్రయాణికులకు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. పలు రూట్‌లలో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో 43 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులకు విధులకు హాజరవుతుని తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement