తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు.
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన సోమవారం ఉదయం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన యనమల సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. పరిహారాన్ని పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.
బాధిత కుటుంబాల్లో విద్యావంతులుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యనమల తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను ఉచితంగానే అందజేస్తామని వెల్లడించారు. కాగా రోడ్డు ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.