స్టీల్‌ ప్లాంట్‌లో దొంగలు

Robbers in steel plant - Sakshi

లారీల్లో పిగ్‌ ఐరన్‌ అక్రమరవాణా

ఒక్కో లారీలో రూ. లక్షకుపైగా సరుకు తరలింపు

సాక్షి, విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి పిగ్‌ ఐరన్‌ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన లారీ పట్టుబడింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న బడా వ్యాపారి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. స్టీల్‌ప్లాంట్‌ నుంచి పిగ్‌ ఐరన్‌ను కొన్న వ్యాపారులు ఎల్‌ఎస్‌జీపీ తీసుకుని లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. ఇందులో భాగంగా లోపలికి ప్రవేశించే ఖాళీ లారీ బరువును చూసి ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సరుకుతో బరువును తూయడం ద్వారా వ్యాపారి కొన్న సరుకును బయటకు పంపుతారు. అక్రమ రవాణాకు అలవాటుపడిన వ్యాపారులు గతంలో లారీ బాడీ కింద భాగంలో ఇసుక మూటలు వేసుకుని వాటితో ఖాళీ లారీ బరువు తూయించుకోవడం, లోపల ఇసుక మూటలను తొలగించి ఎక్కువ సరుకును తరలించడం జరిగేది.

వాటిని పసిగట్టిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బాడీ కింద కూడా తనిఖీ చేయడంతో ఆ తరహా తరలింపు ఆగింది. ఇటీవల వ్యాపారులు కొత్త తరహాలో అక్రమ రవాణా ప్రారంభించారు. ఇందులో భాగంగా బాడీలో ఇసుక, స్లాగ్‌తో గట్టిగా తయారు చేస్తారు. గేట్లలో తనిఖీ చేసే సిబ్బంది బాడీను లిఫ్ట్‌ చేసినపుడు అది కింద పడకుండా ఉంటుంది. మొన్న శనివారం రాత్రి షిఫ్ట్‌లో వ్యాపారికి చెందిన లారీ ప్లాంట్‌లో ఆ విధంగా ప్రవేశించింది. నైట్‌ రౌండ్స్‌లో సీఐఎస్‌ఎఫ్‌ క్రైమ్‌ సిబ్బంది ఎఫ్‌ఎండీ విభాగం సమీపంలో అనుమానస్పదంగా ఉన్న లారీను తనిఖీ చేయగా నాలుగు టన్నుల బరువుతో కూడిన ఇసుక, స్లాగ్‌ గుట్ట బయటపడింది. వెంటనే లారీను స్వాధీనం చేసుకుని స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లారీ పట్టుబడటంతో సదరు వ్యాపారి ఆ లారీకు తనకు సంబంధం లేదన్నట్లు సమాచారం. కాగా, మార్కెట్‌ రేటు ప్రకారం టన్ను పిగ్‌ ఐరన్‌ సుమారు రూ. 27 వేలుగా ఉంది. ఒక్కో లారీలో నాలుగు టన్నులు అంటే రూ. లక్షకు పైగా పిగ్‌ ఐరన్‌  అక్రమంగా తరలిపోతోంది. ఇలా ఎన్ని నెలల నుంచి కోట్లాది రూపాయల విలువైన పిగ్‌ ఐరన్‌  అక్రమ రవాణా జరుగుతుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే దొరికిన లారీ అంశంపై స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు చాలా లైట్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది లారీను తెచ్చిస్తే వారినే ప్రశ్నించడం ద్వారా కేసును నీరుగార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి చీటింగ్‌ కేసు పెట్టి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top