సాగర తీరానికి నూతన సొబగులు

Remodeling In Beach and Dolphin Building - Sakshi

రూ.45 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

డాల్ఫిన్‌ భవనంలో జీవరాశులప్రదర్శనశాల ఏర్పాటుకు సన్నాహాలు

కోడూరు (అవనిగడ్డ) : ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరానికి అటవీ శాఖ అధికారులు నూతన సొబగులు అద్దుతున్నారు. తీరంలోని జీవరాశుల గురించి ప్రతి ఒకరికి వివరించాలనే ఉద్దేశంతో ప్రదర్శనశాల ఏర్పాటుకు పనులు చకచకా సాగుతున్నాయి. 2004 పుష్కరాల సమయంలో పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు నిర్మించిన డాల్ఫిన్‌ భవనంలోని కింద భాగంలో ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీవోపీ సిలింగ్‌తో రూమ్‌ను తీర్చిదిద్దడంతో పాటు అందులో ఏసీలను కూడా అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రదర్శనశాలలో సముద్రంలో జీవించే అన్ని జాతుల చేపలు, డాల్ఫిన్లు, పీతలు, తాబేళ్ల జీవితచక్రాలను వివరిస్తూ పోస్టర్లు, చిత్రాలు, డెమోలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు విద్యార్థుల కోసం ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌ కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో పర్యావరణంకు సంబంధించిన అన్ని అంశాలతో ప్రొజెక్టర్‌ ద్వారా వివరించేందుకు సిబ్బంది నియామకాలకు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు.

రూ.45 లక్షలతో అభివృద్ధి పనులు..
తొలి విడతలో సాగరతీరం అభివృద్ధి కోసం అటవీ శాఖ ద్వారా రూ.45 లక్షల నిధులు కేటాయించారు. ప్రదర్శనశాల, ఎడ్యూకేషన్‌ సెంటర్‌తో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు డార్మెటరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తీరం వెంట ఆ శాఖ ఆధ్వర్యంలో బల్లలు, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.25 లక్షల నిధులు కేటాయించినట్లు అటవీ అధికారులు చెప్పారు. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి సముద్రం వరకు మడ అడవుల పెంపకానికి మరో రూ.20 లక్షల నిధులు సమకూర్చడంతో పాటు మడ విత్తనాలను ఇప్పటికే తీరం వెంట నాటారు. తాబేళ్ల పునరుత్పతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి సంరక్షణ కోసం శాఖాపరంగా వసతులు కూడా కల్పించారు.

రెండు నెలల్లో పనులు పూర్తి..
డాల్ఫిన్‌ భవనంలో మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు బాత్‌రూమ్స్‌ నిర్మించినట్లు అవనిగడ్డ రేంజర్‌ భవానీ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు మరో రెండు నెలల్లో ముగుస్తాయన్నారు. ఇటీవల కేంద్ర అటవీ అనుమతుల మేరకు తీరానికి నూతన విద్యుత్‌ లైన్, తాగునీటి సరఫరా పనులు కూడా ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నట్లు భవానీ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top