ఊరటనిచ్చిన లావాదేవీలు | Reliefs transactions | Sakshi
Sakshi News home page

ఊరటనిచ్చిన లావాదేవీలు

Apr 1 2014 12:38 AM | Updated on Sep 2 2017 5:24 AM

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి.

బెల్లం మార్కెట్ వర్గాల్లో ఆనందం
 9 లక్షల దిమ్మల క్రయవిక్రయం
 రూ.33 నుంచి రూ.35 కోట్ల వ్యాపారం
 
అనకాపల్లి, న్యూస్‌లైన్ : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెలలో 9 లక్షల బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు జరిగినట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇవి లక్షా 35 వేల క్వింటాళ్ల వరకు ఉంటాయి. సుమారు 33 నుంచి 35 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరిగినట్లయింది. వాస్తవానికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో బెల్లం క్రయ విక్రయాలు మందకొడిగా సాగాయి.

డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 55.76 కోట్ల లావాదేవీలు మాత్రమే జరగడంతో 2012-13 సీజన్ లావాదేవీలను అధిగమిస్తుందోలేదోనని మార్కెట్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మార్కెట్లో సుమారు రూ.65 కోట్ల పైబడి వ్యాపారం జరగడంతో  అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 2012-13 సీజన్‌కు నీలం తుఫాన్, 2013-14 సీజన్‌కు భారీ వర్షాలు, నీటిముంపు చెరకు పంటకు తీవ్రనష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి 2011-12 సీజన్‌లో అనకాపల్లి మార్కెట్లో రూ.161.61 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2012-13 సీజన్‌కు అంతకు ముందు సీజన్‌తో పోలిస్తే రూ.18 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో నీలం తుఫాన్ కారణాన్ని చూపించి మార్కెట్ వర్గాలు ఉపశమనం పొందాయి. 2013 -14 సీజన్‌లో కూడా ఇంచుమించు గా రూ.140 కోట్ల లావాదేవీలు జరగడంతో ఈసారి కూడా భారీ వర్షాలు, నీటిముంపును చూసి మార్కెట్ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి.

రాష్ట్రంలో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, జిల్లాలో సాధారణ విస్తీర్ణంకంటే తక్కువుగానే చెరకు సాగు జరగడం, భారీ వర్షాల తాకిడి తోడవడంతో 2013-14 సీజన్ నిరాశాజనకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు ముందే అంచనా వేశాయి. దీనికితోడు బెల్లం ధరలు సైతం ఈ సీజన్‌లో అటు రైతులను, ఇటు వర్తకులను నిరాశపరిచాయి. ఏదిఏమైనా మార్చి నెలలో జరిగిన లావాదేవీలు సీజన్‌లో తగ్గిన వ్యాపారానికి కాసింత సర్దుబాటు చేశాయని చెప్పవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement