నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా 

Redwood Thieves In Nallamala Forest At Kurnool - Sakshi

మళ్లీ మొదలైన స్మగ్లింగ్‌

‘డాన్‌’ మస్తాన్‌వలి తాడిపత్రిలో పట్టివేత  

టాస్క్‌ఫోర్స్‌ అధికారులు 

అవగాహన కల్పిస్తున్నా మారని స్మగ్లర్లు  

కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న నల్లమలలో మళ్లీ ‘ఎర్ర’ దొంగల అలజడి మొదలైంది. గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే డాన్‌గా పేరుగాంచిన చాగలమర్రి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ మస్తాన్‌వలి, ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్‌కుమార్‌ ఈ నెల 15న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో స్మగ్లింగ్‌ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. 

సాక్షి, చాగలమర్రి: ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం వృక్ష సంపద రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఎర్రచందనానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉండంతో కొన్నేళ్లుగా స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికేస్తూ..కలపను అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. రుద్రవరం ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని పాములేటయ్య, బోత్సనిబండ, ఊట్ల, రాచపల్లెబీటు, అహోబిలం, డి.వనిపెంట, పెద్దవంగలి, ఆవుగోరి, మోత్కమానిబావి తదితర ప్రాంతాలతో పాటు వైఎస్సార్‌ జిల్లాలోని కె.వనిపెంట రేంజ్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. వీటితో పాటు అరుదైన మూలికా వృక్షాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం వృక్షాలను కొందరు నరికించి, దుంగలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. కొన్ని నెలల కిందట కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్‌ నిర్వహించారు.

కొందరు తమిళ కూలీలను గుర్తించారు. అరెస్టు చేసేందుకు వెళ్లడంతో వారు తెచ్చుకున్న సామగ్రి, ఆహార పదార్థాలు వదలి పారిపోయారు. తర్వాత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నల్లమలలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎర్రచందనం జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా స్మగ్లర్ల తీరు మాత్రం మారడం లేదు. కొన్ని రోజుల నుంచి అహోబిలం, వనిపెంట, గండ్లేరు, ఆలమూరు తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో వృక్షాలను నరికేస్తున్నారు. దుంగలను భుజంపై మోసుకుంటూ తీసుకొచ్చి.. రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దాస్తున్నారు. ఎవరూ లేని సమయంలో పచ్చిమిర్చి సంచుల్లో దాచి వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి ప్రాంతంలో నీటి కుంటలో దాచిన దుంగలను డి.వనిపెంట సెక్షన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నెల 19న డి.వనిపెంట సెక్షన్‌ పరిధిలోని ఓజీ తండా సమీపంలో దాచి ఉంచిన రూ.లక్ష విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు.

నల్లమల టు జపాన్, ఉత్తర కొరియా 
నల్లమల అడవుల నుంచి ఎర్రచందనాన్ని వాహనాల్లో చెన్నై తీసుకెళ్లి.. అక్కడి నుంచి సముద్ర మార్గం గుండా జపాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, చైనా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్‌ ఉంది. రుద్రవరం రేంజ్‌ పరిధిలో నల్లమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో డాన్‌గా పేరుగాంచిన టీడీపీ నేత మస్తాన్‌ వలిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతనిపై గతంలో అటవీ అధికారులు పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో గడిపి.. టీడీపీ నాయకుల సహకారంతో బయటకు వచ్చాడు. తర్వాత కొన్ని నెలల పాటు అక్రమ రవాణాకు దూరంగా ఉన్న అతను మళ్లీ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న తాడిపత్రి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో చాగలమర్రికి చెందిన ఓ ఫారెస్టు అధికారి సోదరుడు అనిల్‌కుమార్‌ కూడా పట్టుబడడం గమనార్హం. వీరి నుంచి పోలీసులు రూ 2.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, రూ 24,500 నగదు, స్కార్పియో, వెర్నా హుందాయ్, ఐషర్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.   

66 కేసుల నమోదు 
రుద్రవరం రేంజ్‌ పరిధిలో 2015 నుంచి 2019 వరకు ఫారెస్టు అధికారులు 66 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. అలాగే 117 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులలో 215 ఎర్రచందనం దుంగలతో పాటు 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  

గస్తీ నిర్వహిస్తున్నాం 
డి.వనిపెంట సెక్షన్‌ పరిధిలోని నల్లమలలో గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అక్రమ రవాణా కోసం ఎంచుకుంటున్నారు. గిద్దలూరు, కడప, బద్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గస్తీ ముమ్మరం చేశాం. స్మగ్లర్ల ఆట కట్టిస్తాం.  
– శ్రీనివాసులు, డి.వనిపెంట అటవీ సెక్షన్‌ అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top