కూత పెట్టని హామీలు | Railway budget not came favourly in kurnool district | Sakshi
Sakshi News home page

కూత పెట్టని హామీలు

Feb 13 2014 3:03 AM | Updated on Sep 2 2017 3:38 AM

రైల్వే ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపర్చింది. ఆ శాఖ సహాయ మంత్రిగా జిల్లాకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైల్వే ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపర్చింది. ఆ శాఖ సహాయ మంత్రిగా జిల్లాకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆ శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించినా జిల్లాకు ఒరిగింది శూన్యం.
 
 ఇక కొత్త ప్రాజెక్టుల ఊసే కరువైంది. మంత్రి కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రైల్వే వర్క్‌షాప్‌నకు సైతం ప్రాధాన్యత లభించలేదు. దశాబ్దాల డిమాండ్ అయిన మంత్రాలయం రైలు మార్గానికీ గ్రహణం వీడని పరిస్థితి. ఒకటి రెండు రైళ్లు మినహా బడ్జెట్ పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ఈ విషయంలో మంత్రి కోట్ల అసమర్థత ప్రజాగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రూ.2వేల కోట్లు అవసరం కాగా.. ప్రకటనలే తప్ప నిధుల కేటాయింపుపై స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.
 
 వీటి మాటేమి...
 కర్నూలులో రైల్వే వర్క్‌షాప్ ఏర్పాటుకు గత ఏడాది  బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థల సేకరణకు హడావుడి చేశారు. నగర శివారులోని పంచలింగాల వద్ద స్థలాన్ని పరిశీలించినా సేకరణ చేపట్టలేకపోయారు. ఇందుకు రూ.203 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్‌లో మొండిచేయి చూపారు.
 
 దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల హామీ ఇచ్చారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం కాగా కేటాయింపులు చేపట్టలేదు.
 
 మంత్రాలయం నుంచి కర్నూలుకు కొత్త లైన్ సర్వే పనులకు మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండుసార్లు సర్వే చేసి నిధుల దుర్వినియోగం చేశారే తప్ప.. ఈసారీ లైను ఊసెత్తలేదు.
 సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్‌ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం..  ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పనులను పూర్తిగా విస్మరించారు.
 
 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సహా అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్‌లో ఆపాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు.
 
 హొస్పేట్-మంత్రాలయం-కర్నూలు-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామన్న కోట్ల హామీ నీరుగారింది.
 
 ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు మరిచారు.
 
 కాచిగూడ-బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement