breaking news
BUdget district
-
ఆశలు ఆవిరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది. బడ్జెట్లో జిల్లాకు ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు. చెరకు రైతులకు చేదును మిగిల్చింది. అత్తెసరు నిధులతో పల్లెలు.. పట్టణాలు.. రోడ్ల అభివృద్ధి కలగా మారనుంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు.. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రాధాన్యమిస్తారని ఆశపడ్డారు. అయితే చివరకు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపారు. సాగునీటి ప్రాజెక్టులపై ‘చిన్న’చూపు వ్యవసాయానికి ప్రధానవనరులైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూపింది. జిల్లాలో సోమశిల ప్రాజెక్టు, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెన్నా, కండలేరు, ఉత్తరకాలువతో పాటు అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అసంపూర్తి పనులతో ఈ ఏడాది చివరి ఆయకట్టుకు నీరందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పలుచోట్ల నీటి కోసం రైతులు ఘర్షణలకు దిగిన ఘటనలు ఉన్నాయి. సాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారయంత్రాంగం రూ.వెయ్యి కోట్లకుపైనే అవసరమని నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. అదేవిధంగా కావలి కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి సాగునీరు అందిస్తామని కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం హామీ కూడా ఇచ్చారు. అయితే బడ్జెట్లో నిధులు కేటాయింపును చూస్తే జిల్లాకు ఒనగూరిందేమీ లేదని తేలిపోయిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయింపును పరిశీలిస్తే జిల్లాలో సాగు ముందుకు సాగటం కష్టమేనని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రుణాల మాఫీ ఊసేలేదు ఏ హామీతో చంద్రబాబు సీఎం పీఠం దక్కించుకున్నారో.. బడ్జెట్లో ఆ హామీల ఊసెత్తలేదు. రైతు, డ్వాక్రా, చేనేతలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. అందులోభాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి మూడు విడతలుగా అర్హుల జాబితాను ప్రకటించారు. అందులో అర్హులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా జమచేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా డ్వాక్రా రుణాలు, బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం రుణాలు, చేనేతలు తీసుకున్న రుణాల ప్రస్తావన కూడా చేయకపోవటం గమనార్హం. అదేవిధంగా కోవూరు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తానని సీఎం హామీ ఇచ్చి ఉన్నారు. అది తెరుచుకోవాలంటే రూ.15 కోట్లు అవసరం. అయితే బడ్జెట్లో ఆ ప్రస్తావనే రాలేదు. దీంతో నాలుగు వేలమంది చెరకు రైతులకు చంద్రబాబు చేదుని మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్బర్లు.. పోర్టులకు నిధులేవీ బాబూ? జిల్లాలో మత్స్యకార హార్బర్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్య కారులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్ బీచ్, పెంచలకోనలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటికేమీ నిధులు కేటాయించకపోగా.. తమ్మలపెంట తీరాన్ని విహారకేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. అయితే ఈ తీరం ఇప్పటికే అనధికారికంగా ప్రారంభించారు. అక్కడ అన్ని నిర్మాణాలు చేపట్టి ఉన్నారు. పనులు పూర్తిచేసి ఉన్నచోటే మరలా విహారకేంద్రంగా మారుస్తామని ప్రకటించటం గమనార్హం. ఇక పరిశ్రమల విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్టైల్ పార్కు, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు తెస్తానని సీఎం హామీలు గుప్పించారు. అయితే ఏ ఒక్కదానికి నిధులు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొనకపోవటం గమనార్హం. అంగన్వాడీలను పట్టించుకోలా.. అంగన్వాడీ కార్యకర్తలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కనీస వేతనం పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి ఆందోళనలను పెడచెవినపెట్టింది. అన్నింటా కోతలే... ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాల్సి ఉంది. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న చంద్రబాబు బడ్జెట్లో వారిని చిన్నచూపు చూశారు. వారి సంక్షేమానికి అత్తెసరు నిధులు కేటాయించి చేతులు దులుపుకొన్నారని ఆ వర్గం వారు మండిపడుతున్నారు. ఇకపోతే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అర్బన్ డెవలప్మెంట్ను ప్రభుత్వం విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పట్టించుకోలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌సిటీ వైపు చూడలేదు నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా తీర్చిదిద్దుతామని, దేశంలో ఉన్న స్మార్ట్‌సిటీల సరసన చేరుస్తామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. అందుకోసం రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుచేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ‘రే’ కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరుచేస్తున్నామని తెలిపారు. ఇంకా నెల్లూరులో రింగురోడ్డును మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. అయితే బడ్జెట్లో అర్బన్ డెవలప్మెంట్ను విస్మరించారు. వేసవికి గొంతెండాల్సిందేనా? వేసవి రాకముందే పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వేసవి తరుముకొస్తున్న తరుణంలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే బడ్జెట్లో తాగునీటి రంగానికి నిధులు అంతంతమాత్రంగా కేటాయించటంతో పల్లెలు, పట్టణాల్లో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నారు. సమస్యలతో సతమతవుతున్న ప్రజలను ఆదుకునేందుకు నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం వాటిన్నింటినీ పక్కనపెట్టి దగదర్తి వద్ద ‘విమనాశ్రయ’ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అయితే అక్కడ సేకరించిన భూములు ప్రైవేటువని స్థానికులు కోర్టును ఆశ్రయించి ఉండటం గమనార్హం. -
మళ్లీ హుళక్కే..
సంగడిగుంట(గుంటూరు): లోక్‌సభలో గురువారం రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశ పరచింది. ఎన్నో వడ్డిస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూసిన గుంటూరు డివిజన్ పరిధిలోని రైల్వే ప్రయాణికులకు మళ్లీ మొండి చేయ్యే చూపించారు. పైగా, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోగా నూతన రైళ్లను ప్రకటిస్తామంటూ రైల్వే మంత్రి చేసిన ప్రకటనపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నూతన బడ్జెట్‌కు సంబంధించి 20 వేల సూచనలు అందాయన్న మంత్రి వాటిని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. స్వచ్ఛ భారత్, పరిశుభ్రంగా రైళ్లు అం టూ చిల్లర వరాలతో బడ్జెట్ ప్రసంగం ముగించడంతో ఈ ఏడాది కూడా నిధుల కేటాయింపులు లేనట్టేనని అర్థమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లాకు సాధించిందీ ఏమీ లేదు. డివిజన్‌కు సౌకర్యాలు, నూతన రైలు మార్గాలు, ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇలా ఏదీ లేనట్టేనని తేటతెల్లమైంది. ఎలాంటి నిధులు మంజూరు చేయకుండానే రైల్వేస్టేషన్లనే ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పి చేతులు దులుపుకోవడం పట్ల జిల్లా వాసులు విస్మయం వెలిబుచ్చుతున్నారు. ఇక ప్రకటించిన వైఫై సేవలు, తక్కువ ధరకు రక్షిత మంచినీరు, లిఫ్ట్‌లు, ఎస్క్‌లేటర్లు డివిజన్ పరిధిలోని ఎన్ని స్టేషన్లకు అందనున్నాయో వివరాలు ప్రకటించలేదు. శాటిలైట్ స్టేషన్లు, నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం అటుంచి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌కు ఏ విధమైన హంగులు ఏర్పాటు చేయనున్నారనేది తెలియరాలేదు.ఎంత మొత్తంలో నిధులు అందనున్నాయో అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటివరకు లేని ఆనవాయితీ ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తీసుకోవాలని చేసిన ప్రకటనతో ఎంపీలు ఎంత శాతం నిధులు కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఐదు నిమిషాల్లో టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటు, రైల్వేకు ప్రత్యేక యాప్, బోగీలో అప్పర్ బెర్త్‌కు చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తదితర తాయిలాల వల్ల పెద్దగా ఒరిగిందేమీలేదు. కాపలా లేని రైల్వే గేటుల వద్ద కేవలం హెచ్చరిక బోర్డులు మాత్రమే ఏర్పాటును ప్రకటించిన రైల్వే మంత్రికి ప్రయాణికుల భద్రతపై శ్రద్ధలేనట్టు తెలుస్తోంది. ప్రకటించిన రైల్వే అండర్ బ్రిడ్జిల్లో గుంటూరు డివిజన్‌కు ఎన్ని మంజూరు కానున్నాయనేది తెలియాల్సి ఉంది. మహిళలకు భద్రత కల్పించే విధంగా కెమెరాల ఏర్పాటు చర్యలు కొంతమేర హర్షించదగినవిగా కనిపిస్తున్నాయి. ఇక 120 రోజులకు ముందే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారు చక్రాల కుర్చీని ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం వంటి ప్రకటనలు చప్పగా ఉన్నాయి. ఏది ఏమైనా గుంటూరు డివిజన్ పరిధిలో స్టేషన్లు, రైలు మార్గాలు, ప్రత్యేక రైళ్లు, నూతన హంగులు ఒనగూరనున్నాయనే ఆశలపై రైల్వే మంత్రి నీళ్లు చల్లారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్నట్లు రైల్వే మంత్రి చేసిన ప్రకటనపై వేచి చూడాల్సిందే. -
కూత పెట్టని హామీలు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైల్వే ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపర్చింది. ఆ శాఖ సహాయ మంత్రిగా జిల్లాకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆ శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించినా జిల్లాకు ఒరిగింది శూన్యం. ఇక కొత్త ప్రాజెక్టుల ఊసే కరువైంది. మంత్రి కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రైల్వే వర్క్‌షాప్‌నకు సైతం ప్రాధాన్యత లభించలేదు. దశాబ్దాల డిమాండ్ అయిన మంత్రాలయం రైలు మార్గానికీ గ్రహణం వీడని పరిస్థితి. ఒకటి రెండు రైళ్లు మినహా బడ్జెట్ పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ఈ విషయంలో మంత్రి కోట్ల అసమర్థత ప్రజాగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రూ.2వేల కోట్లు అవసరం కాగా.. ప్రకటనలే తప్ప నిధుల కేటాయింపుపై స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. వీటి మాటేమి... కర్నూలులో రైల్వే వర్క్‌షాప్ ఏర్పాటుకు గత ఏడాది బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థల సేకరణకు హడావుడి చేశారు. నగర శివారులోని పంచలింగాల వద్ద స్థలాన్ని పరిశీలించినా సేకరణ చేపట్టలేకపోయారు. ఇందుకు రూ.203 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్లో మొండిచేయి చూపారు. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల హామీ ఇచ్చారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం కాగా కేటాయింపులు చేపట్టలేదు. మంత్రాలయం నుంచి కర్నూలుకు కొత్త లైన్ సర్వే పనులకు మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండుసార్లు సర్వే చేసి నిధుల దుర్వినియోగం చేశారే తప్ప.. ఈసారీ లైను ఊసెత్తలేదు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్‌ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం.. ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పనులను పూర్తిగా విస్మరించారు. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సహా అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్లో ఆపాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. హొస్పేట్-మంత్రాలయం-కర్నూలు-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామన్న కోట్ల హామీ నీరుగారింది. ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు మరిచారు. కాచిగూడ-బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.