 
															మోడీ రాకతో రాహుకేతు పూజల నిలిపివేత
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వచ్చిన సందర్భంగా మూడు గంటల పాటు రాహుకేతు పూజలు నిలిపివేశారు.
	శ్రీకాళహస్తి ఆలయ చరిత్రలో ఇదే  ప్రథమం  
	భద్రత కోసమేనన్న ఈవో
	 
	శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వచ్చిన సందర్భంగా మూడు గంటల పాటు రాహుకేతు పూజలు నిలిపివేశారు. గురువారం నరేంద్రమోడీ, బీజేపీ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వరాలయానికి వి చ్చేశారు. వారి వెంట మరో 50మందిని ఆలయంలోకి అనుమతించారు. భద్రత పేరుతో భక్తులు ఎవర్నీ అనుమతించలేదు. మూడు గంటల పాటు రాహుకేతు పూజలు నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో కేవలం శివరాత్రి సందర్భంగా ఒక్కరోజు మాత్రమే రాహుకేతు పూజ లు నిలిపివేస్తారనీ, మిగిలిన రోజుల్లో నిలిపివేయడం ఆలయ చరిత్రలోనే ఇదే ప్రథమమని   అధికారులు తెలిపారు. గతంలో ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ, దేవెగౌడతో పా టు అనేకమంది ముఖ్యమంత్రులు ఆలయానికి విచ్చేశారు. కానీ ఇలాంటి ఘటనలు చో టు చేసుకోలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో ఆలయ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండుటెండలో భక్తులు అష్టకష్టాలు పడ్డారు.
	 
	 గంటసేపు నిలుపుదల చేశాం: ఈవో
	 నరేంద్రమోదీ ఆలయానికి రావడంతో గంట సేపు మాత్రమే రాహుకేతుపూజలతో పాటు ఇతర పూజలు నిలువుదల చేశామని ఆలయ ఈవో రామచంద్రారెడ్డి తెలిపారు. మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో పాటు 50 మంది దర్శన టికెట్లు కొనుగోలు చేశారు. వారిని మాత్రమే అనుమతించామని చెప్పారు. మోడీ రూ.2,500 రాహుకేతు పూజా టికెట్ కొనుగోలు చేసి పూజ చేసుకున్నారు. ఇతర భక్తులను ఆలయంలోకి అనమతించలేదని ఆయన వివరించారు.
	 
	 శ్రీవారిని దర్శించుకున్న మోడీ
	 సాక్షి, తిరుమల: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్  ఉన్నారు. మోడీ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం ఆలయంలో పచ్చకర్పూరపు వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. పట్టువస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
