ధర్మ పోరాట దీక్ష.. కేంద్రం నిధులతోనే

Pydikondala Manikyala Rao Fire On TDP Government - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. తాడేపల్లి గూడెంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో సుమారు రూ. 27,000 కోట్లు రాష్ట్రానికి ఎమ్‌ఆర్‌జీఎస్‌ నిధులు ఇచ్చిందని, ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టునే నిర్మించేయవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ది పనులు చేపట్టారని తెలిపారు. ఈ నెల 29న టీడీపీ ధర్మ పోరాట దీక్ష కూడా మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని ఎద్దేవ చేశారు. 

హామీలు నెరవేర్చేవరకు పోరాటం
ఆగస్టు 20, 2015న నిట్‌ శంకుస్థాపనలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు నలభై హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ధర్మ పోరాట దీక్షలో ఇచ్చిన హామీలపై ఇచ్చే ప్రకటన ఆధారంగా అవసరమైతే పోరాటం చేస్తానని తెలిపారు. బీజేపీ నుంచి పోటీచేస్తే డిపాజిట్లు తెచ్చుకోలేరని ముళ్లపూడి బాపిరాజు అనడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ పాలన ఇలాగే కొనసాగితే బాపిరాజు తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బీజేపీ నాయకులు తమకు అనుకూలమైన పోలీసులని నియమించుకుంటున్నారని బాపిరాజు అనడం సబబు కాదని, టీడీపీ నాయకుల్లాగా పేకాట, కోడిపందాలు, క్రికెట్‌ బెట్టింగ్‌లతో తమకు పనిలేదని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top