రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు సోమవారం రాత్రి గ్రామానికి వచ్చాడంటూ
అన్నవరం (జగ్గయ్యపేట): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు సోమవారం రాత్రి గ్రామానికి వచ్చాడంటూ వదంతులు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై గ్రామానికి వచ్చాడు. ప్రధాన సెంటర్‌లో కొందరికి అతడిపై అనుమానం రావడంతో వాహనాన్ని ఆపడానికి యత్నించడంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. దీంతో గ్రామస్తులు అతడి వాహనాన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు.
ఈ విషయాన్ని చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యస్.ఐ షణ్ముఖసాయి సిబ్బందితో వచ్చి వెంబడించారు. చివరకు అతను బలుసుపాడు సమీపంలో అతన్ని పట్టుకుని వివరాలు అడుగగా తనది తెలంగాణ రాష్ట్రం అని, కాపుసారా అమ్ముకునేందుకు వచ్చానని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామ సమీపంలోని అనుమాననాస్పదంగా ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.