రామస్వామిపేటపై క్రషర్ల పంజా..

Problems With Crusher To Rama swami Peta People - Sakshi

శృంగవరపుకోట /వేపాడ విజయనగరం : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ క్రషర్ల యజమానులకు కొమ్ముకాస్తోంది.  దీంతో ఆ ఊరి వాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లభించడం లేదు. వేపాడ మండలంలోని రామస్వామిపేట పరిధిలో 8 క్రషర్లు, 14 క్వారీలు ఉన్నాయి.

నిరంతరాయంగా జరుగుతున్న బ్లాస్టింగ్‌లు, స్టోన్‌ క్రషింగ్‌తో వాయు, శబ్ధ, జల కాలుష్యంతో గ్రామం వణుకుతోంది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న స్టోన్‌ క్రషర్లు, క్వారీల నుంచి వచ్చే దుమ్ముతో పచ్చని పొలాలు, చెట్లు తెల్లగా మారి రూపు కోల్పోతున్నాయి.

పంట భూములు చవుడు నేలలుగా  మారుతున్నాయి. జలాలు కాలుష్యం కావడంతో గ్రామస్తులు, పశువులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. క్వారీల్లో జరుగుతున్న పేలుళ్లకు భవనాల గోడలు బీటలుదేరుతున్నాయి.

గ్రామాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న క్రషర్లు, క్వారీలను మూయించాలని ఇప్పటికే పలుమార్లు  గ్రామస్తులు చేసిన ప్రజా ఉద్యమాలు పెట్టుబడివర్గాలు విసిరే కరెన్సీ నోట్ల మధ్య నిలబడలేకపోయాయి.  

బందలు స్వాహా..

స్టోన్‌ క్రషర్ల యజమానులు 52/1లో ఉన్న నక్కలబందను ఆక్రమించారు. ఇదే తీరుగా మెరకబంద, పొట్టేలు బంద, మంగలి బందల్ని  ఆక్రమించి మాయం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సాగునీటి వనరులు మాయమయ్యే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. నక్కల బంద ఆక్రమణపై వివరణ కోరగా తహసీల్దార్‌ డీవీ రమణ తన దృష్టికి సమస్య రాలేదంటూ బదులిచ్చారు.

పొల్యూషన్‌ రిపోర్టు ..

ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 2017 జూలైలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. రెండు రోజుల తర్వాత అన్ని క్రషర్లు నిబంధనలు పాటిస్తున్నాయి.. గ్రీన్‌బెల్ట్‌ పెంచుతున్నారు... బోర్డు నిబంధనలు ఉల్లంఘించలేదు.. వర్షాల వల్ల గాలిలో దుమ్ము శాతాన్ని లెక్కకట్టలేక పోయాం.. గాలి కలుషితం ఐతే చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పి చేతులు దులిపేసుకుని నేటి వరకు తిరిగి చూడలేదు.     

స్వచ్ఛమైన  గాలి కరువు

రాయి బుగ్గితో తెల్లని ధూళి పడి పచ్చని పొలాలు పాడైపోతున్నాయి. గాలి ఎప్పుడు వీచినా దుమ్ము, ధూళి ఉంటోంది. కనీస అవసరాలైన గాలి, నీరు కూడా లేకుండా చేస్తున్నారు. 

 – రొంగలి మధుసూదనరావు, గ్రామరైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top