మహా ప్రసాదం..!

Prasadam Distribution in Dwaraka Tirumala West Godavari - Sakshi

శ్రీవారి భక్తులకు పంచామృతాలు 

రోజురోజుకు పెరుగుతున్న వడ విక్రయాలు  

రాత్రి వేళలో అన్న ప్రసాద వితరణ భేష్‌..  

క్షేత్రంలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చిన తిరుపతి పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఐదు రకాల పంచామృత ప్రసాదాలు గుర్తుకొస్తున్నాయి. లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాలకు ఇటీవల తోడైన మహాప్రసాదం(పెద్ద లడ్డూ), వడ ప్రసాదాలు భక్తులకు మరింత ప్రీతికరంగా మారాయి. ఇక అన్నప్రసాదం విషయానికొస్తే.. తిరుమల తిరుపతి తరువాత అంతటిరుచికరమైన అన్నప్రసాదం ఇక్కడ మాత్రమే లభిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ద్వారకా తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఒక్క శనివారం నాడే దాదాపు 25 నుంచి 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారు. శ్రీవారి దర్శనం పూర్తవగానే భక్తులకు గుర్తుకొచ్చేది స్వామివారి ప్రసాదం. ఇక్కడ షడ్రుచులతో ఐదు రకాల ప్రసాదాలు భక్తులకు లభిస్తున్నాయి. ప్రసాదాలు తయారు చేసే అంబరు ఖానాలో నిత్యం సిబ్బంది ఈ ఐదు రకాల ప్రసాదాల తయారీలో నిమగ్నమవుతున్నారు. ఇక తయారైన ప్రసాదాలను ప్యాక్‌ చేసేందుకు కొం దరు భక్తులు తమ సేవలను అందిస్తున్నారు.

ప్రసాద విక్రయాలు అదుర్స్‌
అన్ని ప్రసాదాల్లో కంటే.. వడ ప్రసాద విక్రయాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. లడ్డూ తరువాత ఎక్కువగా భక్తులు మక్కువ చూపుతోంది ఈ వడ ప్రసాదం మీదే. అలాగే పెద్ద లడ్డూ విక్రయాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ నెల 20 వరకు సాధారణ లడ్డూ ప్రసాదాలు 30,22,261, పులిహోర 12,78,415, శర్కర పొంగలి 6,67,129 ప్యాకెట్లను విక్రయించారు. అలాగే మహా ప్రసాదం(పెద్ద లడ్డూ) విక్రయాలను ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించగా, ఇప్పటి వరకు 6,050 లడ్డూలను విక్రయించారు. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు 17న ప్రారంభమైన వడ ప్రసాదాలు ఇప్పటి వరకు 24,240 అమ్ముడయ్యాయి.

రెండు పూటలా అన్న ప్రసాదం
శ్రీవారి భక్తులకు ఇప్పుడు రెండు పూటలా మహా అన్నప్రసాదం అందుతోంది. రాత్రి వేళ క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు పూటల అన్నప్రసాద వితరణ పథకాన్ని దేవస్థానం నూతనంగా ప్రారంభించింది. స్వామి  సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ, భక్తుల నుంచి విరివిగా వస్తోన్న విరాళాలతో మరింత అభివృద్ధి చెందుతోంది. సామాన్య భక్తులే కాదు.. వీఐపీలు కూడా ఇక్కడకొచ్చి స్వామివారి అన్నామృతాన్ని స్వీకరిస్తున్నారు. రాత్రి వేళ భక్తులకు కదంబం, పెరుగన్నం, చెట్నీని ప్రసాదంగా అందిస్తున్నారు. రెండు పూటలా అన్నప్రసాద వితరణ పథకం తిరుమల తిరుపతి తరువాత, ఏ దైవ సన్నిధిలోను లేని విధంగా ఒక్క చిన వెంకన్న సన్నిధిలోనే నిత్య సాధ్యమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top