పరిశీలించండి.. పరిష్కరించండి

పరిశీలించండి.. పరిష్కరించండి - Sakshi

  •  

  •  టన్ను రూ.1500

  •  కిలో రూపాయిన్నర

  •  భయపడిపోతున్న పేదలు

  •  నిలిచిపోతున్న నిర్మాణ పనులు

  • అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు...కృష్ణానది చెంతనే ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక కరువవుతోంది. జిల్లాలో తట్ట ఇసుక తెచ్చుకోవాలంటే పేదవాడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. పక్క జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి తెచ్చుకోవాలంటే... కిలో ఇసుక రూపాయిన్నర ధర పలుకుతోంది.

     

    నూజివీడు : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుకక్వారీలకు ప్రభుత్వం వేలం వేయకపోవడంతో జిల్లా వాసులకు ఇసుక కష్టాలు నిత్యకృత్యమయ్యాయి.  పేదవాడు చిన్న పక్కాఇల్లు కట్టుకోవాలన్నా పక్క జిల్లాలో ఉన్న గోదావరికి పరిగెత్తాల్సివస్తోంది. అధిక వ్యయంతో ఇసుకను కొనుగోలు  వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో  మధ్య, దిగువ తరగతి ప్రజలు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు.



    జిల్లా వ్యాప్తంగా 74ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటికి పాటలు పెట్టకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెం రేవు వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడినుంచి  ఇక్కడకు వచ్చేసరికి 20టన్నుల లారీకి సుమారు రూ.30వేలు ఖర్చవుతోంది. అంటే కిలో ఇసుక రూపాయిన్నర  ధర పలుకుతోంది.   



    దీంతో మధ్య, దిగువతరగతి ప్రజలు గృహనిర్మాణం చేపట్టాలంటే రోజురోజుకు పెరుగుతున్న వ్యయాన్ని భరించలేక  భయపడుతున్నారు. మరోవైపు బిల్డర్లు కూడా నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేయడమో, లేకపోతే అపార్ట్‌మెంట్‌లలోని ప్లాట్ల ధరలను పెంచేయడమో చేస్తున్నారు. ఇసుకకు నూతన విధానమంటూ,  ఇసుక క్వారీలకు ప్రభుత్వం  పాటలు పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.

     రోజుకు

     

    4వేల టన్నుల వినియోగం



    జిల్లాలో రోజుకు 4వేల టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని భవన నిర్మాణ కార్మికుల సంఘం, ఇతర సంఘాల అంచానా. జిల్లాలలో 8మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్, ప్రజలు నిర్మించుకుంటున్న గృహాలు, ఇందిరమ్మ గృహాలు, అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల ఆధునికీకరణ పనులు తదితర ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతేగాకుండా జిల్లాలో ఉన్న దాదాపు 4వందల మంది బిల్డర్లు పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. అంతేగాకుండా నివేశన స్థలాల ధరలు భారీగా పెరగడంతో పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు అధికంగా సాగుతున్నాయి.  ఒక్క నూజివీడులోనే ప్రస్తుతం 10వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

     

    కిలో ఇసుక రూపాయిన్నర!




    ఇసుక స్థానికంగా దొరకక పోవడంతో ఇసుక వ్యాపారులకు వరంగా మారింది.గోదావరి నుంచి ఇసుకను లారీల్లో తెచ్చినందుకు కిరాయిలతో కలుపుకుని టన్ను రూ.15వందలు పడుతోంది. దానిని స్టాక్ చేసి ఒకటి, రెండు ట్రక్కుల ఇసుక కావాల్సిన వారికి ట్రాక్కర్ ట్రక్కు ఇసుకను రూ.5వేల నుంచి రూ.6వేల  వరకు విక్రయిస్తున్నారు. ఈ ట్రక్కుల్లో కేవలం మూడున్నర టన్నుల ఇసుక మాత్రమే పడుతుంది. దీంతో కిలో ఇసుకరూపాయిన్నర ధర పలుకుతోంది. ఇంత మొత్తంలో వెచ్చించి ఇసుకను కొనలేక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top