‘షాక్‌’ కొడుతున్నా చలనం లేదు..

Power Department Delayed On Current Poll In East godavari - Sakshi

రంపచోడవరం: విరిగిన ఎముకను అతికించడానికి కట్టుకట్టినట్టు..ఫొటోలో అట్టపెట్టెల్ని మడిచి, కట్టి ఉన్నది ఓ కరెంటు స్తంభం. ఆ స్తంభం పటిష్టంగా లేదని, అందుకే అలా అట్టపెట్టెల్ని కట్టారని ఎవరైనా అనుకోవచ్చు. నిజానికి విద్యుత్‌ స్తంభం బలహీనంగా ఉంటే.. అట్టపెట్టెలతో పటిష్టంగా ఉంటుందనుకుంటే అంతకన్నా తింగరితనం ఉండదు. అయితే.. ఆ స్తంభానికి అట్టపెట్టెల్ని కట్టడంలో ఉన్నది అలాంటి తెలివితక్కువతనం కానేకాదు. ఎవరికీ ప్రాణాపాయం జరక్కుండా అడ్డుకోవాలనే తపనతో తోచిన తరుణోపాయం. అంతేకాదు.. ఆ అట్టకట్లు..జనం ప్రాణాలను తృణప్రాయంగా చూసే విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి సాక్ష్యం. రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులోని ఈ విద్యుత్‌ స్తంభానికి విద్యుత్‌ ప్రవహిస్తూ.. తాకిన వారికి షాక్‌ కొడుతోంది.

ఈ విషయమై ఆ శాఖ కార్యాలయానికి పలువురు పలుమార్లు ఫోన్‌ చేసి చెప్పినా అధికారుల్లో చలనం లేదు. ఆ స్తంభానికి విద్యుత్‌ ప్రవహించడం మొదలై పది రోజులు గడిచింది. అయినా ఆ శాఖ సిబ్బంది, అధికారులు అటు తొంగి చూడలేదు. ప్రస్తుతం స్తంభం కొద్దిపాటి షాక్‌ కొడుతున్నా.. అది తీవ్రతరమైతే ప్రాణాంతకమవుతుందన్న భయంతో స్థానికులు.. తోచింది చేశారు. స్తంభానికి దాదాపు ఏడడుగుల ఎత్తు వరకూ అట్టపెట్టెల్ని మడిచి కట్టారు. అయినా అదే రోడ్డులో తిరిగే విద్యుత్‌ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోలేదు. జరగరానిది జరగకముందే కదలిక వచ్చేందుకు..విద్యుత్‌ శాఖకూ ఓ మోస్తరు షాక్‌ అవసరమయ్యేలా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top