చిట్వేలి-రాపూరు రోడ్డులోని మూడో మలుపులో శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మూడు నాటుతుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చిట్వేలి ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
చిట్వేలి, న్యూస్‌లైన్: చిట్వేలి-రాపూరు రోడ్డులోని మూడో మలుపులో శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మూడు నాటుతుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చిట్వేలి ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వేకోడూరు ఎస్‌ఐ రామచంద్ర, స్థానిక ట్రైనీ ఎస్‌ఐ చిరంజీవితో కలసి రాపూరు వైపు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారన్నారు.
వారిని ఆపి సోదా చేయగా, వారివద్దనున్న గోనె సంచుల్లో నాటు తుపాకీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన నిందితులు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వడ్రపాలెంకు చెందిన నక్కల చిరంజీవి, అదే జిల్లా డక్కిలి మండలం కమ్మపల్లెకు చెందిన చంద్రగిరి కోటేశ్వరరావుగా గుర్తించామని చెప్పారు. వారి నుంచి మూడు సింగిల్ బ్యాలెట్ నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హెడ్‌కానిస్టేబుల్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులను శనివారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.