రైల్వేస్టేషన్లలో ‘పోర్‌బందర్‌’ మోడల్‌! | Porbandhar Model in Visakhapatnam Railway Station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో ‘పోర్‌బందర్‌’ మోడల్‌!

Feb 14 2019 7:50 AM | Updated on Feb 14 2019 7:50 AM

Porbandhar Model in Visakhapatnam Railway Station - Sakshi

స్లీపర్లకు పోర్‌బందర్‌ మోడల్‌ రంగులు

సాక్షి, విశాఖపట్నం: రైల్వేస్టేషన్లలో ‘పోర్‌ బందర్‌ మోడల్‌’ను ప్రవేశపెట్టనున్నారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌ స్టేషన్లో అక్కడి రైల్వే అధికారులు స్వచ్ఛత, భద్రతలో భాగంగా పట్టాలు దిగువన ఉండే సిమెంట్‌ స్లీపర్లకు అటూ ఇటూ తెలుపు, మధ్యలో ఎరుపు రంగులు వేయించారు. రైల్వే ఉన్నతాధికారులు ఆ స్టేషన్‌కు వార్షిక తనిఖీలకు వెళ్లినప్పుడు ఇవి విశేషంగా ఆకట్టుకున్నాయి. అవి అందరినీ ఆకర్షించడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రతి స్టేషన్లో ప్లాట్‌ఫారాల ఆరంభం నుంచి చివరి దాకా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వీటిని వేస్తారు. ఇలా రంగులు వేయడం వల్ల సిమెంట్‌ స్లీపర్లకు ఉన్న పెండ్రాల్‌ క్లిప్‌ల పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమై ప్రమాదాలను నివారించడానికి, పరిశుభ్రతను తెలుసుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా స్టేషన్లలో వ్యర్థాల విడుదల, గ్రీజు, ఆయిల్‌ వంటి పదార్థాలతో ఈ పెండ్రాల్‌ క్లిప్పులు సరిగా కనిపించవు.

దీంతో అవి ఉన్నాయో? లేదో? వాటి స్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పుడప్పుడు స్టేషన్లలోనే పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ  దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు అందానికి అందం, భద్రతకు భద్రత ఉండే ‘పోర్‌బందర్‌’ మోడల్‌ను అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. దీనిపై కొద్దిరోజుల క్రితం అన్ని రైల్వే డివిజన్లకు సర్క్యులర్లు జారీ చేశారు. ఇలా వాల్తేరు డివిజన్‌లోని 112 రైల్వేస్టేషన్లలో పోర్‌బందర్‌ మోడల్‌ అమలుకు టెండర్లు పిలిచి పనులకు కొన్నాళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దాదాపు 40 రైల్వేస్టేషన్లలో రంగుల పక్రియ పూర్తయింది. మిగిలిన అన్ని స్టేషన్లలో నెల రోజుల్లో ఈ పోర్‌బందర్‌ మోడల్‌లో రంగులు వేసే పనిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement