రాజకీయ రాజధాని రాజమండ్రి | Sakshi
Sakshi News home page

రాజకీయ రాజధాని రాజమండ్రి

Published Mon, Oct 27 2014 12:30 AM

రాజకీయ రాజధాని రాజమండ్రి

 ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :తూర్పుగోదావరి జిల్లాకు కేంద్రం కాకినాడ అయినప్పటికీ, రాజకీయాలకు మాత్రం రాజధాని రాజమండ్రియేనని శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ తన తొలి కార్యక్రమాలను రాజమండ్రి నుంచే ప్రారంభిస్తుందని, తొలి నాళ్ల నుంచి ఇది ఆచారంగా వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల కార్తిక వనసమారాధన రాజమండ్రిలోని వీఎల్‌పురం కుడుపూడి ధనయ్య తోటలో ఆదివారం జరిగింది.
 
 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసేవారంతా జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులేనని అన్నారు. కుటుంబ సభ్యులమంతా కలిసి వన సమారాధాన చేసుకోవడం శుభపరిణామమన్నారు. మితిమీరిన విశ్వాసం రాజకీయాలకు పనికిరాదని, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ మన యువనాయకుడి బాటలో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా సమన్వయంతో, తిరుగులేని విధంగా చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలంగా ఉందన్న సూచిక కోసమే కార్తిక వనసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
 
 తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు జగన్ మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అంతా కలిసి కట్టుగా ముందుకు నడుస్తామన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకుడు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబుకు నిజానికి, అబద్దానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడుస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు.
 
 ఉత్సాహం నింపిన వనసమారాధన
 పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకు వచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కార్తిక వన సమారాధన వేదికైందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అభినందించారు. ఎమ్మెల్సీ కుమారుడు, యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అభిమానులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు,   గుత్తుల సాయి, తోట సుబ్బారావు నాయుడు, పార్టీ నాయకులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement