పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలు బోసిపోయాయి. తెలంగాణవాదుల నిరసనల భయంతో అధికారిక కార్యక్రమం కొందరు అధికారులకే పరిమితం అయ్యింది.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలు బోసిపోయాయి. తెలంగాణవాదుల నిరసనల భయంతో అధికారిక కార్యక్రమం కొందరు అధికారులకే పరిమితం అయ్యింది. రాష్ర్ట అవతరణ దినాన్ని విద్రోహదినంగా పాటిస్తామన్న టీఆర్‌ఎస్, టీజేఏసీ ప్రకటనల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు మధ్య కార్యక్రమాన్ని మమ అనిపించారు. వేడుకలకు దూరమని ప్రకటించిన మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్‌లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు వస్తున్న వారిని నిలువెల్లా తనిఖీ చేశారు.
నల్ల జెండాలు ఎగరేస్తారేమోనన్న అనుమానంతో జేబురుమాళ్లను కూడా పరిశీలించారు. దీంతో సామాన్యజనం పరేడ్ గ్రౌండ్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. కొంతమంది సామాన్యులు వచ్చినా భద్రత పేరుతో లోపలకు పంపలేదు. ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కిందిస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేడుకలను బహిష్కరించడంతో పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అధికారుల గ్యాలరీలో ఖాళీ కుర్చీలు కనిపించా యి.
కార్యక్రమం 25 నిమిషాల్లో ముగిసింది. ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సరిగ్గా ఉదయం 8.46 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. వచ్చీ రాగానే సమయానికంటే 13 నిమిషాల ముందే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత తెలుగుతల్లికి పూల మాలవేశారు. మా తెలుగుతల్లి గీతాలపనను సౌండ్ సిస్టమ్ ద్వారా వినిపించారు. పతాకావిష్కరణ, ప్రసంగం, గౌరవవందన స్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. పట్టణ ప్రముఖులు, ఉద్యోగులు, పార్టీల నాయకులు, సమరయోధులు, ఇతరులు హాజరుకాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. విద్యార్థుల ఆటపాటలు, కళాకారుల నృత్యాలు, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు అందివ్వలేదు. పోలీసుల హడావుడి మాత్రం కనిపించింది.