ప్రభుత్వ ఉద్యోగంలో చేరే సమయంలో అప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్న వారి ఆనందానికి అవధులుండవు.
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ ఉద్యోగంలో చేరే సమయంలో అప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్న వారి ఆనందానికి అవధులుండవు. పోలీసు శాఖలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు ఎంతో కష్టమైన శిక్షణను సైతం పూర్తిచేసుకుని, ఆ తరువాత పోస్టింగ్‌లు పొందే విషయంలో ఎలాంటి కష్టం లేకుండా, అన్ని వసతులుండే పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండాలని, కాసులు కురిపించే స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని అర్రులు చాస్తుంటారు. ఉన్నతాధికారులపై రాజకీయ నాయకులు, ఇంకొంత మంది స్వామీజీల చేత కూడా సిఫార్సులు చేయిస్తుండటం మామూలైపోయింది. దీంతో ఎలాంటి పైరవీలు చేయించుకోలేని, నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసేవాళ్లు ఏళ్ల తరబడి ప్రాధాన్యత లేని పోస్టింగులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పోలీసు శాఖలో లూప్‌లైన్లుగా పిలిచే పలు కీలక విభాగాల్లో పనిచేయాలంటే అధికారులు నామోషీగా భావిస్తున్నారు.
తాజాగా జిల్లాలో ఎనిమిది మంది ఎస్సైల బదిలీలు జరిగాయి. మరో 19 మంది ఎస్సైల బదిలీలు రెండు విడతలుగా ఈ నెలాఖరులోగా జరుగ నున్నట్లు సమాచారం. కీలక పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లు పొందేందుకు గాను పలువురు ఎస్సైలు పడరానిపాట్లు పడినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను రాజకీయ నేతలు, ఇతర ఉన్నతాధికారుల నుంచి జిల్లా పోలీసు బాస్‌పై ఇప్పటికే ఒత్తిళ్లు తీసుకొచ్చారు. పోలీసు శాఖలో శాంతి భద్రతలు, నేర పరిశోధనలతోపాటు సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్, జీఆర్‌పీ (రైల్వే పోలీసు), ట్రాన్స్‌కో విజిలెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్పీఎఫ్, పీటీసీ, మెరైన్, డీటీసీ, ఆర్టీసీ వంటి విభాగాలున్నాయి.
అయితే వీటన్నింటినీ కాదని కేవలం శాంతి భద్రతలు విభాగాల్లో మాత్రమే పనిచేసేందుకు అంతా ఇష్టపడుతుంటారు. లూప్‌లైన్లుగా పిలిచే ఈ విభాగాల్లో పనిచేయడమంటే పనిష్మెంట్‌గానో, నామోషీగానో భావిస్తుండడం సహజమైపోయింది. మిగిలిన విభాగాల్లో ‘కాసులు’ లభించకపోవడమే అందుకు కారణం. పదోన్నతి పొందినవారు విధిగా రెండేళ్లపాటు లూప్‌లైన్‌లో పనిచేయాల్సి ఉందనే నిబంధన ఉన్నా.. అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఉదాహరణకు జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎస్సైల నుంచి పదోన్నతి లభించగానే లూప్‌లైన్‌లో పనిచేయకుండా నేరుగా శాంతిభద్రతల విభాగంలో ఉంటున్నట్లు తెలిసింది. వీరిలో ఒకరు కేవలం ఆర్నెల్లపాటు మెరైన్ విభాగంలో..మరొకరు 9 నెలలపాటు పీటీసీలో పనిచేసి తిరిగి శాంతిభద్రతల విభాగానికి వచ్చారు.
పనితీరు, సమర్థత, నిజాయితీ, చిత్తశుద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బదిలీల వ్యవహారంలో న్యాయం చేయాలంటూ పలువురు అధికారులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.