Sakshi News home page

వీడని సంకెళ్లు

Published Wed, Jun 22 2016 1:59 AM

వీడని సంకెళ్లు

13 రోజులుగా పోలీసు వలయంలో జిల్లా
కర్ఫ్యూని తలపించే వాతావరణం
కాపు ప్రజాప్రతినిధులు, నేతల నిర్బంధాలు
ఆందోళనకారుల అరెస్టు
రోడ్లపై బారికే డ్లు, ముళ్లకంచెలతో ఆంక్షలు
వేలాది మంది పోలీసుల మోహరింపు
ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలు

 
 సాక్షి, రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో 13 రోజులుగా జిల్లా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. కర్ఫ్యూను తలపించేలా భారీ స్థాయిలో పోలీసులు మోహరింపుతో జనజీవనం స్తంభించింది. తుని ఘటన సందర్భంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 9 నుంచి ముద్రగడ దీక్ష చేపట్టడం, అదే రోజు సాయంత్రం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి బలవంతంగా తరలించడం తెలిసిందే. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. అప్పటినుంచీ రాజమహేంద్ర వరంలో పోలీసు ఆంక్షలు కొనసాగతూండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 ఉద్యమంపై ఉక్కుపాదం...
 సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేయడంతో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించింది. ఏపీఎస్పీ, ఏఆర్, సీఆర్‌పీఎఫ్, సివిల్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన సుమారు ఐదు వేల మంది పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
 
  ముద్రగడకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టిన ఆందోళనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. కాపు నేతలు, యువత బయటికి రాకుండా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పలువురు కాపునేతలు, ప్రతిపక్ష కాపు నేతలకు గృహనిర్బంధం విధించారు. దీనిని నిరసిస్తూ మహిళలు పిల్లాపాపలతో రోడ్లపైకి వచ్చి ఆందోనలు చేయడంతో పోలీసులకు వారిపై లాఠీచార్జ్ చేశారు. మహిళల స్ఫూర్తితో యువత రోడ్లపైకి వచ్చి ముద్రగడకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
 
 స్తంభించిన జనజీవనం...
 ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రోడ్లపై బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో రోజులతరబడి జనజీవనం స్తంభించిపోతోంది. కార్యాలయాలు, ఇళ్లకు వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలతో విసుగెత్తిపోతున్నారు. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడంపై మండిపడ్డారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసు వాహనాల సైరన్, మైకుల్లో ప్రచారంతో పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వ్యాపారాలు లేక వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. రోజూ రాత్రి 10 గంటల వరకూ తెరచి ఉంచే దుకాణాలను ముందుగానే మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement