కష్టాలకే కన్నీళ్లొచ్చె! | Please Support For My Children Poor Family Kurnool | Sakshi
Sakshi News home page

కష్టాలకే కన్నీళ్లొచ్చె!

Aug 1 2018 7:47 AM | Updated on Aug 1 2018 7:47 AM

Please Support For My Children Poor Family  Kurnool - Sakshi

పిల్లలకు సపర్యలు చేస్తున్న హిమాంబీ

ఆటపాటలతో తోటి యువకుల మధ్య సరదాగా గడపాల్సిన వారికి నాలుగు గోడలే ప్రపంచమయ్యాయి. అందరిలాగా ఉన్నత చదువులు చదవాల్సిన వారు మంచానికే పరిమితమయ్యారు. రెండు పదుల వయసు దాటినా అమ్మ చేతిముద్ద లేకపోతే ఆ రోజు కడుపు నిండని దుస్థితి. కనీసం సొంతంగా కాలకృత్యాలు కూడా తీర్చకోలేని దయనీయ పరిస్థితి. ఇలాంటి ఇద్దరి పిల్లలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆ తల్లికి భర్త మృతి కోలుకోలేని దెబ్బ. ఈక్రమంలో తల్లిదండ్రులకు వద్దకు చేరినా అక్కడా కష్టాలే ఆహ్వానం పలికాయి. ఆమె దయనీయ పరిస్థితికి కష్టాలకు కూడా కన్నీళ్లొస్తున్నాయి.. 

తుగ్గలి(కర్నూలు): విధి పగపట్టడం అంటే ఇదేనేమో.. పుట్టిన ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు కావడం,  పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి.. ఆ ఇల్లాలని కష్టాల్లోకి నెట్టాయి. దీనికి తోడు తల్లిదండ్రుల అనారోగ్యం, కడు పేదరికం ఆమెను దయనీయ స్థితికి చేర్చాయి.  వివరాల్లోకెళితే.. మండలంలో గిరిగెట్ల గ్రామానికి చెందిన రసూల్‌బీ, రాజాసాహెబ్‌ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కూతురు ఇమాంబీని 25 ఏళ్ల క్రితం  డోన్‌కు చెందిన ఖలీల్‌తో వివాహం జరిపించారు. వీరికి ఖాదర్‌బాషా(23), చాంద్‌బాషా(21) ఉన్నారు.

వీరికి పుట్టుకతో నరాల బలహీనత, మానసిక వికలత్వం ఉంది. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటారు. ఆకలేస్తే అన్నం పెట్టమని ఆడగలేని దుస్థితి వీరి అవసరాలన్నీ తల్లి చూసుకోవాల్సిందే. వీరిని ఎలాగైనా బాగు చేసుకోవాలని కర్నూలు, తిరుపతి, పుట్టపర్తి, బళ్లారి, మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పెళ్లయిన ఐదేళ్లకే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లిదండ్రుల వద్దకు చేరింది.

 చుట్టుమట్టిన కష్టాలు 
కష్టాలకు కుంగిపోకుండా పుట్టిన పిల్లలతో ఎలాగైనా బతకాలని ఆత్మస్థైర్యంతో ముందుకుసాగింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా కూలీనాలీ చేసుకుంటూ కుమారులను పోషించింది. తల్లి దగ్గర పిల్లలను ఉంచి తండ్రితో పాటు కూలీ పనులకు వెళ్లేది. అయితే 6 నెలల క్రితం తల్లి రసూల్‌బీ పక్షవాతానికి గురై లేవలేని స్థితికి చేరుకుంది. కష్టాలు చాలవన్నట్లు రెండు నెలల క్రితం తండ్రి రాజాసాహెబ్‌ కూడా కింద పడి కాలు విరిగింది. కష్టాల మీద కష్టాలు రావడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈక్రమంలో పనులు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలతో పాటు తల్లిదండ్రులను బాగోగులు చూసుకుంటోంది. 

దాతలూ స్పందించండి.. 
ఇమాంబీ, పిల్లలకు వచ్చే పింఛన్‌ సొమ్ము వారికి వైద్యానికే సరిపోవడం లేదు. రేషన్‌  బియ్యం, అక్కడక్కడ కొంత అప్పు చేస్తూ బతుకు బండిని నడిపిస్తోంది. దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. సాయం చేయాల్సి వారు ‘ఇమాంబీ షేక్‌– 91067294654–4(ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు– తుగ్గలి)లో నగదు జమ చేయాలని లేదా 8499067538 నంబరుకు ఫోన్‌ చేయాలని వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement