పదోన్నతుల్లో ఇష్టారాజ్యం

Piravies in Eluru DIG Range Office - Sakshi

 ఏలూరు రేంజ్‌ పోలీసు  కార్యాలయంలో అక్రమాలు

పదోన్నతికి నోచుకోని 1983 బ్యాచ్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు

1989, 90, 92 బ్యాచ్‌కి చెందిన ఉభయ గోదావరి జిల్లాల వారికి పదోన్నతులకు సిఫార్సు

మామూళ్లు తీసుకుని చక్రం తిప్పిన ఓ ఉద్యోగి

ఏలూరు డీఐజీకి విన్నవించిన పలువురు హెడ్‌ కానిస్టేబుళ్లు

సాక్షి, అమరావతి బ్యూరో : ఏలూరు రేంజ్‌ పరిధిలో ఏఆర్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుళ్లగా పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియార్టీతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించారు. 1983 బ్యాచ్‌కు 2017లో ప్రమోషన్లు రాగా.. 1990 బ్యాచ్‌కు చెందిన వారికి మాత్రం 2014లోనే పదోన్నతులు రావడం విశేషం. కాగా రేంజ్‌ పరిధిలో 1983, 84 బ్యాచ్‌లకు చెందిన 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు మాత్రం నేటికీ పదోన్నతికి నోచుకోకపోవడం విడ్డూరం. మొత్తం మీద రేంజ్‌ పరిధిలో 134 మంది అర్హులుఉన్నప్పటికీ వీరు పదోన్నతులకు దూరంగా ఉండిపోవడం గమనార్హం.

సీనియార్టీకి మంగళం..
సాధారణంగా ఏ ఉద్యోగికి పదోన్నతి ఇవ్వాలన్నా ముందుగా అతని సీనియార్టీ పరిగణనలోకి తీసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయం. కొన్ని పదోన్నతులు ఉద్యోగి అసాధారణ ప్రతిభను ఆధారంగా చేసుకుని కూడా ఇవ్వడం చూశాం. కానీ ఏలూరు రేంజ్‌ పోలీసు కార్యాలయంలో మాత్రం ఈ రెండింటికి భిన్నంగా నోషనల్‌ సీనియార్టీ ప్రాతిపదికన ఏఆర్‌ పోలీసులకు పదోన్నతులు కల్పిస్తూ జూనియర్లను సీనియర్లుగా జాబితాలో చోటు కల్పించారు. తద్వారా అసలైన సీనియర్లకు పదోన్నతి లభించకుండాపోయింది. 

చక్రం తిప్పిన ఉద్యోగి..
ఏలూరు డీఐజీ రేంజ్‌ పరిధిలోకి రాజమండ్రి అర్బన్, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్‌లు వస్తాయి. వీటి పరిధిల్లో దాదాపు మూడు వేలకుపైగా ఏఆర్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 750 మంది వరకు ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన 134 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలు పదోన్నతులు లభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సీనియార్టీ జాబితాను రూపొందించడంలో రేంజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి ఒకరు చక్రం తిప్పడంతో చాలా మంది జూనియర్లు ఏఎస్‌ఐలుగా పదోన్నతులు పొందినట్లు తెలుస్తోంది. 2012, 2013 బ్యాచ్‌కు చెందిన వారు కూడా ఏఎస్‌ఐలు పదోన్నతులు పొందారంటే రేంజ్‌ పరిధిలో అక్రమాలు ఏమేరకు జరుగుతున్నాయో స్పష్టమవుతోంది.

పదోన్నతులకు 1983 బ్యాచ్‌ దూరం..
విజయవాడ కమిషనరేట్‌ పరిధితోపాటు ఏలూరు రేంజ్‌లో పనిచేస్తున్న 1983 బ్యాచ్‌కు చెందిన సుమారు 20 మందికిపైగా హెడ్‌కానిస్టేబుళ్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రేంజ్‌ పరిధిలో పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేంజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పలువురు హెడ్‌కానిస్టేబుళ్లతో మామూళ్లు తీసుకుని సీనియార్టీ జాబితాను రూపొందించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 1983 బ్యాచ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుళ్ల పేర్లకు బదులుగా 1990 బ్యాచ్, ఆ తర్వాత బ్యాచ్‌ హెడ్‌కానిస్టేబుళ్ల పేర్లను నోషనల్‌ సీనియార్టీ సాకు చూపి ప్రమోషన్ల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇదే విషయంపై కమిషనరేట్‌ పనిచేస్తున్న ఏఆర్‌ సిబ్బంది గురువారం రాత్రి డీసీపీ కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.

ఏలూరు డీఐజీకి వినతి
ప్రతి నెలా మూడో శుక్రవారం పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కోసం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో శుక్రవారం విజయవాడ కమిషనరేట్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీనియార్టీ జాబితా రూపకల్పనలో జరుగుతున్న అన్యాయంపై వివరించగా.. అందుకు ఆయన స్పందిస్తూ రేంజ్‌ పరిధిలో ఎంతమందికి ఇలా అన్యాయం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి డీఐజీ హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top