పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ | PHC in Biomimetic | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్

Dec 30 2013 2:04 AM | Updated on Sep 2 2017 2:05 AM

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) సకాలంలో తెరుచుకొని.. సిబ్బంది అందుబాటులో ఉండేందుకు వీలుగా

రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) సకాలంలో తెరుచుకొని.. సిబ్బంది అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆ శాఖ అధికారు లు చర్యలు చేపడుతున్నారు. రిజిస్టర్లలో హాజ రు నమోదు చేసే ప్రక్రియ స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైద్యాధికారులతో సహా సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. హాజరు పట్టీల్లో మాత్రం సంతకాలు ఉంటున్నాయి. సమయపాలన లేకపోవడం వల్ల పేదలకు వైద్యం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చూసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసే బయో మెట్రిక్ యంత్రాల్లో  అక్కడి వైద్యాధికారితో సహా సిబ్బంది అందరూ వేలిముద్ర వేయాల్సిందే. అప్పుడే వారి హాజరు, సమయం నమోదవుతాయి. 
 
 సీసీ కెమెరాల ఏర్పాటు సన్నాహాలు
 బయో మెట్రిక్ విధానం నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే అది అమల్లో ఉన్న ఇతర శాఖలు, కార్యాలయాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలి ముద్ర వేసే నెపంతో యంత్రాన్ని గట్టిగా నొక్కడం, ఇష్టానుసారం స్వీచ్‌లు నొక్కేసి యంత్రం పాడయ్యేలా చేయడం చాలా చోట్ల జరుగుతోందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేయనున్న బయోమెట్రిక్ యంత్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆన్‌లైన్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయంలో రికార్డు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. దీని వల్ల బయోమెట్రిక్ యంత్రాన్ని ఎవరు పాడు చేసినా తెలిసిపోతుంది.
 
 తొలి విడతలో అమలయ్యే పీహెచ్‌సీలు
 జిల్లాలో తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ పీహెచ్‌సీలను కూడా అధికారులు ఖరారు చేశారు. మాకివలస, తిలారు, పోలాకి, గుప్పెడుపేట, ఉర్లాం, జలుమూరు, అచ్చుతాపురం, సారవకోట, దూసి, తొగరాం, గుత్తావల్లి, ఎల్.ఎన్.పేట, అక్కులపేట, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, పొన్నాడ, సింగుపురం, గార, కళింగపట్నం, శ్రీకూర్మం ఆరోగ్య కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
 
 త్వరలోనే అమలు:డీఎంహెచ్‌వో 
 జిల్లాలోని 20 పీహెచ్‌సీల్లో తొలివిడతగా బయోమెట్రిక్ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్న విషయాన్ని డీఎంహెచ్‌వో గీతాంజలి ధ్రువీకరించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తునామన్నారు. యంత్రాల కోసం ఇండెంట్ పెట్టామని, అవి రాగానే అమర్చి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement