పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ ఉండడంతో జిల్లా గజగజ వణుకుతోంది.
పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ ఉండడంతో జిల్లా గజగజ వణుకుతోంది. మేఘాల మార్గంలో దూసుకు వస్తున్న ఝంఝామారుతాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విలవిలలాడుతోంది. ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ‘అల’జడి పొంచి ఉందని అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అల్లకల్లోలంగా ఉన్న కడలికి మత్స్యకారులు దూరంగా ఉండాలన్న ప్రకటనలతో గంగపుత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది.
యలమంచిలి, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫాన్ జిల్లా తీర ప్రాంతాల్లో కలవరం సృష్టిస్తోంది. ఫైలిన్ విరుచుకు పడనుందన్న హెచ్చరికలతో నలుదిశలా అలజడి నెలకొంది. ముఖ్యంగా తుఫాన్ కారణంగా మత్స్యకారులకు, తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఎదురు కానుందని హెచ్చరికలు వెలువడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెను తుఫాన్ ప్రభావం విశాఖపై అధికంగా ఉండవచ్చన్న ఆందోళనతో పాలనా వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమైంది.
బుధవారం సాయంత్రం తుఫాన్ హెచ్చరికలు జారీకావడంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెల్లవారుజామునే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితిపై కలవరం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి క్రమేణా పెరుగుతోంది. తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో ఆందోళన నెలకొంది. తుఫాన్ హెచ్చరికలతో గురువారం చేపలవేట నిలిచి పోయింది. ఒడ్డున ఉన్న తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వలలు, ఇం జన్లను గ్రామాలకు తరలించారు. తీర గ్రామాల్లో తహశీల్దార్‌లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అప్రమత్తం చేశారు. వీఆర్‌వోలు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాల నితహశీల్దార్‌లు ఆదేశించారు. అచ్యుతాపు రం మండలం, పూడిమడక గ్రామ మత్స్యకారులు ఫైలిన్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు. సముద్రపు నీరు ఇళ్ల ను ముంచెత్తవచ్చని భయపడుతున్నారు. శు క్రవారం ఉదయానికి ఫైలిన్ తుఫాన్ తీవ్రత పెరగవచ్చన్న హెచ్చరికలతో తీరంలో తా టాకు పాకల్లో నివసిస్తున్న మత్స్యకారులను తరలించడానికి సమాయత్తమవుతున్నారు.
అప్రమత్తత అవసరం
ఎస్.రాయవరం : విపత్తుల సమయంలో తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డిఎస్పీ రమేశ్ చెప్పారు. గురువారం సముద్ర తీర ప్రాంతాలయిన బంగారమ్మపాలెం ,రేవుపోలవరం గ్రామాల్లో పర్యటించి అప్రమత్తంగా ఉండాలని మత్యకారులకు చెప్పారు. వరాహ నదీ పరివాహక ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డీఎప్పీ వెంట ఎస్‌ఐ కె అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు.
ఎగసిపడుతున్న కెరటాలు
రాంబిల్లి : ఫైలిన్ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గురువారం వాడపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం తీరాల్లో సముద్రపు అలల ఉధృతి పెరిగింది. మరోపక్క మేజర్, మైనర్ శారద నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణపురం వద్ద మైనర్ శారద వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో గట్లకు గండ్లు పడే ప్రమాదం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.