breaking news
arokhya Raj
-
వరద బాధితులకు సాయం
=జలాశయాల ఆధునికీకరణ =రైతులకు పెద్ద ఎత్తున రుణాలు =రచ్చబండ దరఖాస్తుదారులకు రేషన్‌కార్డులు =రాష్ట్రావతరణ దినోత్సవంలో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పె-లీన్, భారీ వర్షాలకు నష్టపోయిన వారికి సాయమందేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపట్రానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇటీవల వరదలు కారణంగా ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. ప్రభుత్వ పరంగా అందించిన సాయాన్ని తప్పకుండా బాధితులందరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ భారీ వర్షాలలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన అధికార యంత్రాంగానికి, ఇతర స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. జలయజ్ఞం కార్యక్రమం కింద జలాశయాల ఆధునికీకరణలో భాగంగా రూ.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాండవ జలాశయ పనులను 2014 జూన్ నాటికి, అలాగే 10.8 కోట్లతో కోణాం పనులను 2014 మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. రైవాడ పనులలో 27 శాతం రూ.5.5 కోట్లను వెచ్చించి పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని రూ.43.25 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.640 కోట్ల మేర పంట రుణాలను 1.45 లక్షల మంది రైతులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన 1.48 లక్షల మంది రైతులకు నష్టపరిహారంగా మంజూరైన రూ.30.41 కోట్లు పంపిణీ జరుగుతోందన్నారు. గత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం స్వీకరించిన 1,23,044 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 1,09,595 దరఖాస్తులను అర్హులుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా కార్డులు పొందలేని కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిమ్మాపురంవిజ్ఞాన్ హైస్కూల్, మధురవాడ విజయం హైస్కూల్, చైతన్య రెడ్నం గార్డెన్ హైస్కూల్, ఎండాడ మండల పరిషత్ ఉన్నత పాఠశాల , జ్ఞానాపురం సెక్రెడ్ హార్ట్ హైస్కూల్, డాబాగార్డెన్స్‌లో ఉన్న ఎంజీఎం హైస్కూల్ విద్యార్థులు తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీపీ మహీధర్‌రెడ్డి, ఎస్పీ దుగ్గల్‌లు జ్ఞాపికలు అందజేశారు. గిరిజనాభివృద్ధికి కృషి పాడేరు ఏజెన్సీ పరిధిలో గిరిజనుల సంక్షేమం,అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కింద గతేడాది జిల్లాకు మంజూరైన రూ.30 కోట్లతో చేపట్టిన పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మంజూరు చేసిన మరో రూ.30.65 కోట్లతో కనీస మౌలిక వసతులైన రోడ్లు, బ్రిడ్జ్‌లు, కల్వర్టులు, పాఠశాలలకు అదనపు భవనాలు, తాగునీటి వనరుల అభివృద్ధికి అనేక నిర్మాణ పనులకు పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అరకులో కో-ఎడ్యుకేషన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, కొయ్యూరు మండలం మర్రిపాలెంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఏజెన్సీలో 1.35 లక్షల కాఫీ తోటల పెంపకం ద్వారా 1.31 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు. పేదలకు గృహ వసతి రచ్చబండ, ఇందిరమ్మబాట కార్యక్రమాల్లో దరఖాస్తుదారుల్లో ఎంపికయిన 3.55 లక్షల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 2.63 లక్షల మందికి పక్కా ఇళ్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రూ.177 కోట్లు వెచ్చించి 9 వేల గృహాలను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు. డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి, డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాలకు అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆరు శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 900 యూనిట్లకు సంబంధించి 8750 మంది లబ్ధిదారులకు రూ.10.07 కోట్లను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పంపిణీ చేశారు. -
ఫైలిన్ కలవరం.. అధికారులు అప్రమత్తం
పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ ఉండడంతో జిల్లా గజగజ వణుకుతోంది. మేఘాల మార్గంలో దూసుకు వస్తున్న ఝంఝామారుతాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విలవిలలాడుతోంది. ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ‘అల’జడి పొంచి ఉందని అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అల్లకల్లోలంగా ఉన్న కడలికి మత్స్యకారులు దూరంగా ఉండాలన్న ప్రకటనలతో గంగపుత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది. యలమంచిలి, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫాన్ జిల్లా తీర ప్రాంతాల్లో కలవరం సృష్టిస్తోంది. ఫైలిన్ విరుచుకు పడనుందన్న హెచ్చరికలతో నలుదిశలా అలజడి నెలకొంది. ముఖ్యంగా తుఫాన్ కారణంగా మత్స్యకారులకు, తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఎదురు కానుందని హెచ్చరికలు వెలువడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెను తుఫాన్ ప్రభావం విశాఖపై అధికంగా ఉండవచ్చన్న ఆందోళనతో పాలనా వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమైంది. బుధవారం సాయంత్రం తుఫాన్ హెచ్చరికలు జారీకావడంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెల్లవారుజామునే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితిపై కలవరం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి క్రమేణా పెరుగుతోంది. తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో ఆందోళన నెలకొంది. తుఫాన్ హెచ్చరికలతో గురువారం చేపలవేట నిలిచి పోయింది. ఒడ్డున ఉన్న తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వలలు, ఇం జన్లను గ్రామాలకు తరలించారు. తీర గ్రామాల్లో తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అప్రమత్తం చేశారు. వీఆర్వోలు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాల నితహశీల్దార్లు ఆదేశించారు. అచ్యుతాపు రం మండలం, పూడిమడక గ్రామ మత్స్యకారులు ఫైలిన్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు. సముద్రపు నీరు ఇళ్ల ను ముంచెత్తవచ్చని భయపడుతున్నారు. శు క్రవారం ఉదయానికి ఫైలిన్ తుఫాన్ తీవ్రత పెరగవచ్చన్న హెచ్చరికలతో తీరంలో తా టాకు పాకల్లో నివసిస్తున్న మత్స్యకారులను తరలించడానికి సమాయత్తమవుతున్నారు. అప్రమత్తత అవసరం ఎస్.రాయవరం : విపత్తుల సమయంలో తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డిఎస్పీ రమేశ్ చెప్పారు. గురువారం సముద్ర తీర ప్రాంతాలయిన బంగారమ్మపాలెం ,రేవుపోలవరం గ్రామాల్లో పర్యటించి అప్రమత్తంగా ఉండాలని మత్యకారులకు చెప్పారు. వరాహ నదీ పరివాహక ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డీఎప్పీ వెంట ఎస్ఐ కె అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. ఎగసిపడుతున్న కెరటాలు రాంబిల్లి : ఫైలిన్ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గురువారం వాడపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం తీరాల్లో సముద్రపు అలల ఉధృతి పెరిగింది. మరోపక్క మేజర్, మైనర్ శారద నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణపురం వద్ద మైనర్ శారద వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో గట్లకు గండ్లు పడే ప్రమాదం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కలెక్టర్ మది దోచిన మన్యం సొగసులు
అరకు రూరల్/అనంతగిరి రూరల్, న్యూస్‌లైన్: అరకు, అనంతగిరి మండలాల్లోని పర్యాటక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చారు. కుటుంబ సభ్యులతో అనంతగిరి మండలంలోని హిల్రెస్టారెంట్లో శనివారం రాత్రి బస చేసి, ఆదివారం సందర్శిత ప్రాంతాల్లో విహ రించారు. ఉదయాన్నే పద్మాపురం ఉద్యానవన కేంద్రాన్ని తిలకించా రు. టాయ్ ట్రైయిన్‌లో గార్డెన్ అంతా కలియ తిరిగారు. పూలతోటలను వీక్షించి ఆనందంతో పరవశించిపోయారు. గిరిజన సాంస్కృతిక మ్యూజియంను తిలకించి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మ్యూజియంలోని కళాకృతులను చూసిన ఆయన గిరిజన సంప్రదాయ,ఆచార వ్యవహారాలు, ప్రాచీన సంస్కృతిపై ఆరా తీశారు. కలెక్టర్ బంగ్లాలో అల్పహారం అనంతరం అనంతగిరి మండలంలోని బొర్రాగుహలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి కాఫీ తోటల్లో విహరించారు. ఆయన వెంట బొర్రాగుహాలు,ఏపీటూరిజమ్ మేనేజర్లు గౌరీశంకర్, గాసి, కార్యదర్శి సోమేష్ ఉన్నారు.