పీజీ వైద్య సీట్ల ఖరారు | pg medical seats Finalized for two states | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య సీట్ల ఖరారు

Jun 11 2014 12:02 AM | Updated on Oct 9 2018 6:57 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న పీజీ, డిప్లొమా సీట్లు ఖరారయ్యాయి. 2014-15 సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరగనుంది.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,191 సీట్లు    
ప్రైవేటు కళాశాలల్లో 1,292 సీట్లు
 అత్యధికంగా 107 జనరల్ మెడిసిన్
 104 సీట్లతో తర్వాతి స్థానంలో ఎండీ జనరల్ సర్జన్
 ఉస్మానియాలో 276, విశాఖ ఏఎంసీలో 176 సీట్లు
 ఆదిలాబాద్, ఒంగోలు రిమ్స్‌లతో పాటు ప్రాతినిధ్యం లేని అనంత కళాశాల
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న పీజీ, డిప్లొమా సీట్లు ఖరారయ్యాయి. 2014-15 సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారతీయ వైద్యమండలి పలు ప్రభుత్వ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి సీట్లను మంజూరు చేసింది.
 
 అనంతరం ఉన్నతాధికారులు ఏ కళాశాలల్లో ఎన్ని సీట్లు ఉన్నాయన్న సమాచారాన్ని ఇచ్చినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సీట్ల ఆధారంగానే త్వరలో యూనివర్సిటీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా అందులో 11 కళాశాలల్లో 1,191 సీట్లు ఖరారయ్యాయి. గత ఏడాది 1,139 సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. ఈ ఏడాది ఆయా కళాశాలల్లో సకాలంలో మౌలిక వసతులు కల్పించి, బోధనా సిబ్బందిని నియమించి ఉంటే మరో 100 సీట్లు తక్కువ కాకుండా పెరిగేవి. వసతులు లేని కారణంగానే విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో కొన్ని విభాగాల్లో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆదిలాబాద్ రిమ్స్, ఒంగోలు రిమ్స్ కళాశాలల్లో పీజీ సీట్లకు ఇప్పటికీ ప్రాతి నిథ్యం లేదు. ఈ ఏడాది అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు రెండు పీజీ సీట్లను (పర్మిటెడ్ సీట్లుగా) కేటాయించినా వాటికి కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఈ లెక్కన మొత్తం మూడు కళాశాలలకు పీజీ సీట్లలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీజీ సీట్లు ప్రస్తుతానికి 1,292గా తెలిసింది. వీటిలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు ఎంసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
 
 జనరల్ మెడిసిన్‌దే అగ్రస్థానం
 
 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గత కొన్నేళ్లుగా జనరల్ మెడిసిన్ సీట్లదే హవా కనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తం 107 సీట్లతో ఈ విభాగం ముందంజలో ఉంది. దీని తర్వాత 104 సీట్లతో ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. పీజీ వైద్యవిద్యలో అత్యంత డిమాండ్ ఉన్న విభాగంగా పేరున్న ఎంఎస్ ఆర్థోపెడిక్ విభాగంలో 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. మహిళా వైద్యుల్లో ఎక్కువ మంది కోరుకునే ఎంఎస్ (ఒ.బి అండ్ జి-అబ్‌స్ట్రెట్రీషియన్ అండ్ గైనకాలజీ) సీట్లు 65 ఉన్నాయి.  ఎండీ పీడియాట్రిక్  సీట్లకు డిమాండ్ ఉన్నా కేవలం 49 ఉండగా, ఎండీ అనస్థీషియా (మత్తు) వైద్య సీట్లు 65 ఉన్నాయి. రాష్ట్రంలో కళాశాలల్లో 276 పీజీ సీట్లతో ఉస్మానియా అగ్రభాగంలో ఉండగా, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాల 176 సీట్లతో రెండో స్థానంలో ఉంది.
 
 కొన్ని ప్రధాన విభాగాల్లో సీట్ల వివరాలు
 విభాగం    సీట్లు
 ఎండీ జనరల్ మెడిసిన్    107
 ఎండీ అనస్థీషియా    65
 ఎండీ రేడియాలజీ    15
 ఎండీ పీడియాట్రిక్    49
 ఎంఎస్ జనరల్ సర్జరీ    104
 ఎంఎస్ ఆఫ్తాల్మాలజీ    58
 ఎంఎస్ ఆర్థోపెడిక్    47
 ఎంఎస్ ఈఎన్‌టీ    33
 ఎంఎస్ ఓబీఅండ్‌జీ    65
 ఎండీ అనాటమీ    34    
 
 కళాశాలల వారీగా పీజీ వైద్య సీట్లు
 కళాశాల    సీట్లు
 ఉస్మానియా    276
 గాంధీ    133
 కేఎంసీ వరంగల్    107
 ఏఎంఎసీ విశాఖ    176
 జీఎంసీ గుంటూరు    98
 ఎస్వీఎంసీ తిరుపతి    100
 ఆర్‌ఎంసీ కాకినాడ    111
 కేఎంసీ కర్నూలు    109
 సిద్ధార్థ విజయవాడ    56
 రిమ్స్ కడప    20
 రిమ్స్ శ్రీకాకుళం    03


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement