కరోనా లేదన్నా ఇంట్లోకి రానివ్వలేదు

People Not Allowing Women Came From Odissa In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆ మహిళ వేరే రాష్ట్రం నుంచి తను ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. వేరే ప్రాంతం నుంచి రావడంతో అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయిస్తే నెగిటివ్‌ వచ్చింది. అయినా స్థానికులు మాత్రం ఆమెను ఇంటికి రానీయకపోవడంతో వార్డు సచివాలయాన్ని ఆశ్రయించింది. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేట పాత పోస్టాఫీసు వీధిలో వావిలపల్లి లక్ష్మి అద్దె ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ఒడిశా రాష్ట్రం రాయగడలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ చిక్కుకుపోయింది. 

ఎక్కువ కాలం అక్కడ ఉండిపోతే ఇళ్లల్లో పనులు పోతాయన్న భయంతో 53 ఏళ్ల వయసులో అష్టకష్టాలు పడి 120 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే శ్రీకాకుళం చేరుకుంది. అయితే ఆమె అద్దెకుంటున్న వీధి వారు కరోనా భయంతో ఆమెను పోలీసులు, వైద్య సిబ్బందికి అప్పగించారు. ఈ నెల 21న శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి.. ఐసోలేషన్‌ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను అంబులెన్స్‌లో ఆమె అద్దెకుండే ఇంటి వద్ద విడిచిపెట్టారు. అయితే ఆ వీధివాసులు, ఇంటి యజమాని సైతం ఆమెను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె వార్డు సచివాలయానికి వెళ్లింది. తనకు కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంట్లోకి రానీయడం లేదని వారి ముందు తన గోడు వెళ్లబోసుకుంది. చివరకు ‘సాక్షి’ చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులకు సర్ది చెప్పి ఆమెను ఇంటికి చేర్చారు. 
(బాంబులతో లేపేస్తా.!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top