వారం రోజుల్లో పట్టిసీమ నుంచి నీరు విడుదల

Pattiseema Water Release In This Week West Goadavari - Sakshi

జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌

ఏలూరు (మెట్రో) : గోదావరిలో నీటి మట్టం పెరుగుతోందని, ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నందున వారం రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారుల సమావేశంలో ఖరీఫ్‌ పంటకు నారుమడులు, కౌలు రైతులకు రుణాలు, శివారు ప్రాంత భూములకు సాగునీరు వంటి అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. గోదావరిలో ఇప్పటికే 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని మన అవసరాలకు పదిహేను వేల క్యూసెక్కుల నీరు సరిపోతుందని మిగిలిన 15వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులను ఆదుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. కృష్ణా కాలువ నుంచి పట్టిసీమ నీరు రావడానికి ఆలశ్యమవుతున్న దృష్ట్యా తూర్పు లాకుల వద్ద గురువారం సాయంత్రంలోగా మోటార్ల ద్వారా దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల పరిధిలో వరి నర్సరీలు పెంచుకునేందుకు వీటిని మళ్లించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మూడు మండలాల పరిధిలో 440 హెక్టార్లలో వరి నర్సరీ పెంచాల్సిన అవసరం ఉన్నదని రేపు సాయంత్రానికల్లా తూర్పు లాకుల ప్రాంతాన్ని తనిఖీ చేస్తానని మోటార్లు అన్ని పని చేస్తూ ఉండాలన్నారు.

18.55శాతం పామాయిల్‌ దిగుబడి సొమ్ము ఇవ్వాల్సిందే
జిల్లాలో పామాయిల్‌ రైతులకు 18.55శాతం ఆయిల్‌ దిగుబడి చొప్పున ఇకపై సొమ్ము చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ఆయిల్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాల ప్రగతితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ఆయిల్‌పామ్‌ రైతులకు 16.4 శాతం దిగుబడి మాత్రమే వస్తుందంటూ సొమ్ము చెల్లిస్తుండటంతో పలువురు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలోని సత్తుపల్లిలో 18.55 శాతం ఆయిల్‌ దిగుబడి వస్తుండటంతో అక్కడే  ఆయిల్‌పామ్‌ గెలలు క్రషింగ్‌ చేయించడంతో నిరూపితమైందన్నారు. ఇకనుంచి ఆయిల్‌పామ్‌ రైతులకు 18.55 శాతం వంతున సొమ్ము చెల్లించాలని, దీన్ని అన్నిక ంపెనీలు పాటించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో వాస్తవాలతో కూడిన నివేదికలు సమర్పించకపోతే సంబంధిత అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.

పరిశ్రమలకు 24 గంటల్లో అనుమతులు
పరిశ్రమలకు అవసరమైతే 24 గంటల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పా.  స్థారునిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి భారీ పరిశ్రమలకు కూడా 48 గంటల్లో అనుమతులు ఇచ్చి రికార్డు సృష్టించాలని అంతే తప్ప చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి అనుమతులను జాప్యం చేయొద్దని కలెక్టర్‌ సూచించారు. ఆన్‌లైన్‌ విధానం అమల్లో ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ పరిశీలిస్తూ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. దీనివల్ల నూతన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పశ్చిమ వైపు ఎదురుచూస్తారని ఆయన చెప్పారు.

వట్లూరు బ్రిడ్జి ఆలస్యంపై ఏఈ సస్పెన్షన్‌
వట్టూరు బ్రిడ్జి దశాబ్దం దాటుతున్నా నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కలెక్టర్‌ ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. దీనికి బాధ్యులని తక్షణం సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆర్‌అండ్‌బీ  ఏఈ శేషుకుమార్‌ను బుధవారం సాయంత్రానికి సస్పెండ్‌ చేయాలని ఆశాఖ ఎస్‌ఈ నిర్మలను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు జేసీ షరీఫ్, డీఆర్వో సత్యనారాయణ, వ్యవసాయశాఖ జేడీ గౌసియాబేగం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఇ నిర్మల, పరిశ్రమల శాఖ జీఎం త్రిమూర్తులు, జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పర్సంటేజీలు మానుకుంటే నాణ్యమైన రోడ్లు
పర్సంటేజీలు మానుకుంటేనే నాణ్యమైన రోడ్లు దర్శనమిస్తాయని లేకపోతే ఎన్నాళ్లు అయినా  ఆధ్వానస్థితి తప్పదని   కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు.  బుధవారం మధ్యాహ్నం ఆర్‌అండ్‌బీ అధికారులతో రోడ్లు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీలో అవినీతి రాజ్యమేలుతోందని ఏ రోడ్డు చూసినా నిర్మించిన ఆరు నెలలకే గతుకులమయం అవుతోందని కలెక్టర్‌ చెప్పారు.  క్షేత్రస్థాయి నుంచి ఆర్‌అండ్‌బీ సిబ్బంది, అధికారులు పర్సంటేజీలు వదులుకుంటే నాణ్యమైన రోడ్లను  ప్రజలు చూడగలుగుతారని ఆయన చెప్పారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డుపై గర్భిణి ప్రయాణిస్తే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందని కలెక్టర్‌ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top