సగం పాఠాలయ్యాక శిక్షణా.. .? | Pathalayyaka half of the training .. .? | Sakshi
Sakshi News home page

సగం పాఠాలయ్యాక శిక్షణా.. .?

Nov 19 2013 1:37 AM | Updated on Sep 2 2017 12:44 AM

నూతన పాఠ్యపుస్తకాలు వచ్చి, పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన తరువాత వాటిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.

=కొత్త పాఠ్య పుస్తకాలపై ఐదు నెలల తర్వాత శిక్షణ తరగతులు
 =రాజీవ్ విద్యామిషన్ నిర్వాకం
 =పెదవి విరుస్తున్న ఉపాధ్యాయులు

 
నూజివీడు, న్యూస్‌లైన్ : నూతన పాఠ్యపుస్తకాలు వచ్చి, పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన తరువాత వాటిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం పాఠాలు బోధించడం పూర్తయిన తరువాత శిక్షణనిచ్చి ఏం ప్రయోజనమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రణాళిక లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో, అటు తల్లిదండ్రుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పలు తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మార్చింది. దీనిలో భాగంగా 4 నుంచి 8వ తరగతి వరకు నూతన పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చింది. ఈ పాఠ్యాంశాలపై ఈ నెల 18 నుంచి 20 వరకు ప్రాథమికోన్నత స్థాయిలో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు జిల్లా వ్యాప్తంగా శిక్షణనిస్తున్నారు. ఈ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలపై పాఠశాలల ప్రారంభానికి ముందే శిక్షణనిచ్చి ఉంటే ఎంతో ఉపయోగం ఉండేదని ఉపాధ్యాయ వర్గాలే కాకుండా మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.

పాఠశాలలు తెరిచి ఇప్పటికే ఐదు నెలలు గడిచిన తరువాత, సిలబస్ దాదాపు సగం పూర్తయ్యాక శిక్షణనివ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది ఆర్‌వీఎం అధికారులకే తెలియాలి. నూతన పాఠ్యపుస్తకాలలో అనేక కొత్త అంశాలను చేర్చారు. ముఖ్యంగా ఆంగ్ల పాఠ్యపుస్తకాలలోని అంశాలు బోధించాలంటే కొంత సంక్లిష్టంగానే ఉందనేది ఉపాధ్యాయుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పుస్తకాలు విద్యార్థుల చేతికి రాకముందే ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించి ఉంటే విద్యార్థులకు ఉపయోగం కలిగి ఉండేది.

అసలే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విద్యార్థులకు పనిదినాలు తగ్గిపోవడంతో సెలవు దినాలలో కూడా పాఠశాలలకు వెళ్లాల్సివస్తున్న నేపథ్యంలో మరల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్‌వీఎం అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, తద్వారా ఫలితాలు ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement