రెండు రోజులుగా రైలు టాయిలెట్‌లోనే..

Passenger Gets Stuck To Train Toilet For Two Days In Narasapur Express - Sakshi

అపస్మారక స్థితిలో వ్యక్తి

ఆలస్యంగా గుర్తించిన రైల్వే సిబ్బంది

ఆస్పత్రికి తరలింపు

సాక్షి, నరసాపురం: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. టాయిలెట్‌కు వెళ్లి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి రెండు రోజులు అందులోనే ఉండిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గురువారం బాధితుడి కుమారుడు రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌కుమార్‌ వద్దకు అతని తండ్రి నర్సీరావు తరచూ వెళ్లి వస్తుంటాడు. గత నెల 31న రాత్రి ఏడు గంటలకు నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో టాయిలెట్‌కు వెళ్లిన ఆయన అందులోనే స్పృహతప్పి పడిపోయాడు. మర్నాడు ఉదయం 6 గంటలకు రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది.

అక్కడ బోగీలను తనిఖీచేసి, శుభ్రం చేసే సిబ్బంది లోపల గడియపెట్టి ఉన్న బోగీని పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి నాంపల్లి నుంచి బయలుదేరిన రైలు రెండో తేదీ ఉదయం నరసాపురం చేరుకుంది. అక్కడ బోగీని కడిగే సమయంలో సిబ్బంది.. టాయిలెట్‌ లోపల ఎవరో ఉండిపోయారన్న విషయాన్ని గుర్తించారు. గడియ పగులగొట్టి లోపల అపస్మారక స్థితిలో ఉన్న నర్సీరావును నరసాపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన జేబులో ఉన్న బుక్‌లో ఫోన్‌ నంబరు ఆధారంగా కుమారుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రిని ఎవరూ పట్టించుకోలేదని.. ఫోన్, డబ్బులు అపహరించారని రాజ్‌కుమార్‌ వాపోయాడు. రైలు ఎక్కిన తన తండ్రి హైదరాబాద్‌ రాకపోవడంతో ఒకటో తేదీనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top