నా బిడ్డను చూపడం లేదు | palle bharathi Concerns.. | Sakshi
Sakshi News home page

నా బిడ్డను చూపడం లేదు

Aug 23 2014 2:49 AM | Updated on Sep 2 2017 12:17 PM

నా బిడ్డను చూపడం లేదు

నా బిడ్డను చూపడం లేదు

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా తన బిడ్డను చూపకుండా ఇబ్బందులు పెడుతున్నారని రఘునాథరెడ్డి అన్న కోడలు పల్లె భారతి ఆవేదన వ్యక్తం చేశారు.

- మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్న కోడలి ఆవేదన
- కన్నబిడ్డ కోసం పలమనేరు పెళ్లి సత్రం వద్ద పడిగాపులు
- విషయం తెలిసి ముందుగానే వెళ్లిపోయిన భర్త   

పలమనేరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా తన బిడ్డను చూపకుండా ఇబ్బందులు పెడుతున్నారని రఘునాథరెడ్డి అన్న కోడలు పల్లె భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్తతో పాటు ఉంటున్న కుమార్తె పలమనేరులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం బంధువుల పెళ్లికి హాజరవుతుందని తెలుసుకున్న బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంకటరమణారెడ్డి తన కుమార్తెతో పాటు పలమనేరు నుంచి వెళ్లిపోయారు.

పెళ్లి మండపం వద్ద భర్త, కుమార్తె కోసం బాధితురాలు కొంతసేపు వెతికారు. వెంకటరమణారెడ్డి ఇక్కడికి రాలేదని పెళ్లి వారు చెప్పారు.  అనంతరం ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తనకు 1999లో పల్లె రఘునాథరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డితో వివాహమైందన్నారు. తన తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. కొన్నాళ్లకు భర్తతో కలిసి అమెరికాలోని చికాగోకు వెళ్లామన్నారు. తనకు ఉద్యోగం లేకపోవడంతో భర్త వేధించేవాడన్నారు.

2003లో పాప త్రిష పుట్టిందని, 2011లో స్వదేశానికి వచ్చామని తెలిపారు. తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే వదిలిపెట్టి బిడ్డతో పాటు బెంగళూరుకు వెళ్లిపోయారన్నారు.  తనకు జరిగిన అన్యాయంపై పల్లె రఘునాథరెడ్డిని ఆశ్రయించగా న్యాయం చేస్తామని చెప్పి తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తాము ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. విషయం తెలుసుకున్న రఘునాథరెడ్డి రాజకీయంగా తనకు ఇబ్బందులొస్తాయని చెప్పి రాజీ చేశారన్నారు. ఆ తర్వాత తనను ఎవరూ పట్టించుకోలేదని, బిడ్డను కూడా చూపలేదని వాపోయూరు. తనకు ముఖ్యమంత్రి అయినా న్యాయం చేయాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement