రోడ్డు ప్రమాదంలో పాలకొండ ఎమ్మెల్యే కుమారుడు మృతి
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక శుగ్రీవులు కుమారుడు శ్రీనివాసరావు దుర్మరణం చెందారు.
	(ఎం.చంద్రశేఖర్ బాబు-పాలకొండ)
	 శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిమ్మక శుగ్రీవులు కుమారుడు శ్రీనివాసరావు  దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం  ఎమ్మెల్మే కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామంలో ఒక పెళ్లికి హాజరయ్యారు. వారు కారులో వెళ్లారు. కుమారుడు శ్రీనివాస రావు  స్పోర్ట్స్ బైకుపై వెళ్లారు.  పెళ్లి చూసుకొని ఎమ్మెల్యే శుగ్రీవులు, అతని భార్య రాత్రి పాలకొండ తిరిగి వచ్చారు.
	
	రాత్రి పూట చలిగా ఉంటుందని, కుమారుడు శ్రీనివాస రావుని కూడా తమతో రమ్మని తల్లిదండ్రులు అడిగారు. అయితే అతను తన బైకుపై వస్తానని చెప్పి వారితో బయలుదేరలేదు. అర్దరాత్రి 2 గంటలు దాటిన తరువాత శ్రీనివాసరావు తనబైకుపై బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటలకు పాలకొండ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తరువాత రెండెడ్ల బండికి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు.
	
	శ్రీనివాసరావు హైదరాబాద్లో బిటెక్ చదువుతున్నారు. నిమ్మక శుగ్రీవులు దంపతులకు శ్రీనివాసరావు ఒక్కడే కొడుకు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
