కుర్చీలాటలో పై‘చేయి’ ఎవరిదో? | Pairavilu for the Zilla Parishad CEO post | Sakshi
Sakshi News home page

కుర్చీలాటలో పై‘చేయి’ ఎవరిదో?

Nov 4 2013 1:48 AM | Updated on Sep 2 2017 12:15 AM

నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో తలమునకలయ్యే జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం ఇప్పుడు వివాదాలకు వేదికైంది.

 

=జిల్లా పరిషత్  సీఈవో పోస్టుకోసం పైరవీలు
 =సీఈవో, డిప్యూటీ సీఈవోలుగా ఇద్దరి నియామకం
 =వేరే ఇద్దరికి అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు
 =సుబ్బారావుకు మంత్రి అండ !

 
సాక్షి, మచిలీపట్నం : నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో తలమునకలయ్యే జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం ఇప్పుడు వివాదాలకు వేదికైంది.    కార్యాలయ పరిపాలనాపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో), డిప్యూటీ సీఈవో పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఈ పోస్టుల్లో ఇద్దరిని నియమించిన ఉన్నతాధికారులు తమ పని అయిందనిపించారు.

ఇంతలోనే వేరే ఇద్దరికి  ట్రిబ్యునల్  అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ వివాదం ముదురుపాకాన పడింది. వీరితో నిమిత్తం లేకుండా ఇదే జిల్లాలో ఆర్డీవోగా పనిచేసిన ఉద్యోగి ఒకరు రాజకీయ అండతో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెరసి జెడ్పీ సీఈవో పోస్టు కోసం సాగుతున్న పైరవీలపై కొద్ది రోజులుగా రసవత్తర చర్చ జరుగుతోంది. జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న సీఎస్.కొండయ్యశాస్త్రికి బదిలీ రావడంతో సెప్టెంబర్ 1న రిలీవ్ అయ్యారు. దీంతో జెడ్పీ సీఈవోగా జిల్లా రెవెన్యూ ఆధికారి (డీఆర్వో) ఎల్.విజయ్‌చందర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

అదే సమయంలో నందివాడ ఎంపీడీవోగా పనిచేసిన చింతా కళావతికి డిప్యూటీ సీఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లాలోని సీనియర్ ఎంపీడీవోలకే సీఈవోగా బాధ్యతలు అప్పగించాలని, ఇతర శాఖలకు చెందిన వారికి ఆ బాధ్యతలు ఇవ్వడం సరికాదంటూ జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీవోలు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బి.నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

పూర్తికాలపు సీఈవో  లేకపోతే అర్హులైన ఎంపీడీవోలకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు. వారి వాదనతో ఏకీభవించిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో డిప్యూటీ సీఈవోగా ఉన్న కళావతికి సీఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఎంపీడీవో జి.వి.సూర్యనారాయణను డిప్యూటీ సీఈవోగా, ఎ.కొండూరు ఎంపీడీవో అనురాధకు జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 7న ఉత్తర్వులు జారీ చేశారు.
 
అంత వరకు బాగానే ఉన్నా..  అదే సమయంలో తనకు సీఈవో పోస్టు ఇవ్వాలంటూ గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన సుబ్బారావు తనకు అనుకూలంగా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ప్రజాప్రతినిధులు ఉన్నారని సిఫారసు లేఖలతో   ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో సుబ్బారావును జిల్లాలో సీఈవోగా నియమించుకోవాలంటూ రెవెన్యూ శాఖ సూచిం చింది. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి స్పందిస్తూ ఇతర శాఖలకు చెందిన వారికి జెడ్పీ సీఈవో ఇచ్చే అవకాశం లేదని, తమ శాఖకు చెందిన వారికే పదోన్నతి ఇచ్చి సీఈవోగా నియమించుకుంటామంటూ తేల్చి చెప్పారు. దీంతో సుబ్బారావు  నియామకం నిలిచిపోయింది.
 
ఇదే సమయంలో తాము సీనియర్లమని, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు తమకే ఇవ్వాలంటూ 1999 బ్యాచ్ డెరైక్ట్ రిక్రూట్ ఎంపీడీవో క్యాడర్‌కు చెందిన ఇద్దరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో ఇన్‌చార్జి సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా నియమించిన కళావతి, సూర్యనారాయణ కంటే తామే సీనియర్లమంటూ  రాజీవ్ విద్యామిషన్ ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్  ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జ్యోతిబసు, కృష్ణమోహన్‌లకు సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలంటూ అక్టోబర్ 24న ట్రిబ్యునల్  తీర్పు చెప్పింది.

ఆ ఆదేశాలను అమలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టుల కోసం కుర్చీలాట మరింత రసకందాయంలో పడింది. ముందు నియమించిన కళావతి, సూర్యనారాయణ ఇద్దరు తామే ఇన్‌చార్జులుగా కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇన్‌చార్జి బాధ్యతలు దక్కించుకునేందుకు జ్యోతిబసు, కృష్ణమోహన్  ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు సుబ్బారావు మరోమారు జెడ్పీ సీఈవో పోస్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు వేగిరం చేశారు. వీరిలో జెడ్పీ సీఈవో కుర్చీ ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement