
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గత శనివారం తెల్లవారు జామున అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సుబ్బారావుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనను ఏడాది కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్యపదజాలంతో అశ్లీల సూచనలు చేస్తూ తనను ఒంటరిగా ఇంటి వద్ద కలవాలని మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘ప్రభుత్వం మాది, నీ ఉద్యోగం ఉండాలంటే నాతో ఇంటి వద్ద రాత్రి ఒంటరిగా కలవాలని, నేను చెప్పినట్లు వినాలి’ అని బెదిరించినట్టు వివరించారు. ఆరు నెలల క్రితమే విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ మధ్య సుబ్బారావు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా నరకం అనుభవించానని, గత్యంతరం లేక ఆత్మహత్యా యత్నం చేశానని గోడు వెళ్లబోసుకున్నారు.
విషయం పక్కదారి పట్టించే యత్నం..
అసలు విషయం పక్కదారి పట్టించేందుకు సుబ్బారావు పలువురు డ్వాక్రా సభ్యులను ఆటోల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్త్రీ నిధి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా నిధులు స్వాహా చేసిందని బాధితురాలి మీద ఆరోపణలు చేయించారు. సుబ్బారావు తమ తరఫున ఉన్నందున ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డ్వాక్రా సభ్యులు పదేపదే ఆయనకు అండగా నిలిచే యత్నం చేశారు.
శనివారం తెల్లవారు జామున బాధితురాలు నిద్రమాత్రలు మింగిన విషయం తెలుసుకున్న వీరు సోమవారం ఉదయం నగదు స్వాహా చేసిందని వెలుగు కార్యాలయంలో అధికారులకు డ్వాక్రా సభ్యులతో చెప్పించే యత్నం చేయడం గమనార్హం. స్త్రీ నిధి నగదు కొంత తన వద్ద ఉన్న మాట వాస్తవమే అని, వాటిని తిరిగి సంస్థకు జమ చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. తన వ్యక్తిగత సమస్యకు డ్వాక్రా నిధులకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.