అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం

Published Tue, Jul 8 2014 1:48 AM

అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం - Sakshi

నరసన్నపేట రూరల్: బొరిగివలస అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలు పరుగులు తీశారు. సోమవారం ఉదయం కేంద్రం తెరిచేటప్పటికే పాము లోపల ఉంది. అయితే ముందుగా దీనిని ఎవరూ గుర్తించ లేదు. కొద్ది సమయం అయిన తర్వాత పాము బుసలు వినిపించడంతో అనుమానంతో కార్యకర్త, ఆయాలు లోపల వెతికారు. నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. కేంద్రంలో పిల్లల కోసం ఉంచిన గుడ్లును అప్పటికే అధికంగా పాము తాగింది. దీంతో కదలలేని స్థితిలో ఉండడంతో ఇబ్బంది కలగలేదు.
 
 సుమారు గంట పాటు కేంద్రంలోనే పాము ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి పామును పట్టుకొని తీసుకువెళ్లారు. దీంతో కేంద్రంలోని పిల్లలు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా కేంద్రంకు ఆనుకొని ముళ్లతుప్పలు ఉండటమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. పాము వల్ల ఒకవేళ ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది మేల్కొని అంగన్ వాడీ కేంద్రాల చుట్టూ ముళ్ల తుప్పలు, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
 
 

Advertisement
Advertisement