ఆపరేషన్‌ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది

Operation Muskan In Nellore - Sakshi

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

162 మంది బాలకార్మికులకు విముక్తి

సీడబ్ల్యూసీకి 26 మంది అప్పగింత  

సాక్షి, నెల్లూరు: అక్షరాలు నేర్చుకుంటూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన కొందరు బాలలు చీకట్లో మగ్గిపోతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం పోలీసు అధికారులు ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టాండ్లు, క్వారీలు, ఇటుకబట్టీలు, హోటల్స్, ధాబాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో 25 మంది, నెల్లూరు రూరల్‌లో ఇద్దరు, గూడూరు పరిధిలో 53 మంది, కావలిలో ఇద్దరు, ఆత్మకూరు పరిధిలో 69 మంది, నెల్లూరు మహిళా పోలీసుస్టేషన్‌ పరిధిలో 11 మంది ఇలా జిల్లా వ్యాప్తంగా 162 మంది బాలకార్మికులను గుర్తించారు.

అనంతరం వారిని విచారించారు. వీరిలో 136 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన 26 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో వారిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులకు అప్పగించారు. నగరంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో ఆపరేషన్‌ ముస్కాన్‌పై నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనులకు పంపడం, వారిచేత పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. నగరంలో 25 మంది బాలకార్మికులను గుర్తించామని, పిల్లలను పనిలో పెట్టుకున్న 17 మంది యజమానులపై కార్మిక శాఖ వారి సహకారంతో కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో చిన్నబజారు, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్లు మధుబాబు, ఎం.నాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్‌ సురేఖ, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ గణేష్, జేజేబీ సభ్యులు జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top