ఒంగోలు కలెక్టరేట్ ఉద్యోగులు క్షణ క్షణం భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒంగోలు టౌన్ : కలెక్టరేట్ ఉద్యోగులు క్షణ క్షణం భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ క్షణాన ఎప్పుడు ఎక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ దెబ్బకు అధికారులు, సిబ్బంది విధులపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత చూపలేకపోతున్నారు. ఒకవైపు కీలకమైన ఫైళ్లు, ఇంకోవైపు షార్ట్ సర్క్యూట్ రూపంలో తరుముకొస్తున్న భయంతో సీట్లలో కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నారు. కలెక్టరేట్‌లో వారం వ్యవధిలో మూడుసార్లు షార్ట్ సర్క్యూట్ కావడమే ఇందుకు కారణం.
ఇసుకను తమ వద్ద సిద్ధంగా ఉంచుకుంటున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం అడిషనల్ జాయింట్ కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఉన్న డిస్పాచ్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూటైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సమీపంలో ఉన్న పలువురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు ఇసుకతో చేరుకొని మంటలు వ్యాపించకుండా ఆర్పి వేశారు. కలెక్టరేట్‌లోనే తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, కలెక్టరేట్ పరిపాలనాధికారి గాంధీలు పట్టించుకోకపోవడంపై అక్కడ పనిచేసే ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.
హై ఓల్టేజీ వస్తే హడలే
కలెక్టరేట్‌లోని విద్యుత్ లైన్‌కు హై ఓల్టేజీ వచ్చిందంటే అక్కడ పనిచేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ హడలిపోతున్నారు. ఒక్కసారిగా హై ఓల్టేజీ రావడం, విద్యుత్ వైర్లు కాలిపోవడం జరుగుతోంది. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ చాంబర్‌తో సహా, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లలో స్వల్పంగా మంటలు వచ్చి ట్యూబులైట్లు కాలిపోయాయి.
కీలకమైన అధికారుల చాంబర్లలో ట్యూబ్‌లైట్లు కాలిపోయిన వెంటనే యుద్ధప్రాతిపదికన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు తప్పితే సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ విజయకుమార్ తన చాంబర్‌కు వచ్చినప్పుడు మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం లేదు. ఆయన ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే స్వయంగా పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది.
ఆయన తన చాంబర్‌లో లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం, అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం సర్వసాధారణమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటే మంచిదని ఉద్యోగులు చెబుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.